Harish Rao | ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్‌రావును అరెస్టు చేయవద్దన్న మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టును పొడిగించింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి గాదగోని చక్రధర్ గౌడ్ ఫిర్యాదు మేరకు నమోదైన కేసుపై తాజాగా హైకోర్టు విచారణ చేపట్టింది. కౌంటర్ దాఖలు చేయాలని చక్రధర్ గౌడ్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది. అప్పటివరకు హరీశ్‌రావును అరెస్టు చేయవద్దనే ఉత్తర్వులను పొడిగించింది.
హరీశ్‌రావు మంత్రిగా ఉన్న సమయంలో తన ఫోన్ ట్యాపింగ్ చేశారని, తనపై బెదిరింపులకు పాల్పడ్డారని గత నెల 1వ తేదీన సిద్దిపేటకు చెందిన రియల్ఎస్టేట్ వ్యాపారి, కాంగ్రెస్ నేత గాదగోని చక్రధర్ గౌడ్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో 120(బీ), 386, 409, 506ఆర్/డబ్ల్యూ, 34ఐపీసీ, 66 ఐటీ యాక్ట్ ప్రకారం హరీశ్‌రావుపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని, తనను అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలని హరీశ్‌రావు అప్పట్లో హైకోర్టును ఆశ్రయించారు.
హరీశ్‌రావు పిటిషన్‌పై గతంలో విచారణ చేపట్టిన హైకోర్టు.. ఆయన్ను అరెస్టు చేయరాదని పోలీసులను ఆదేశించింది. హరీశ్‌రావుపై ఎటువంటి కఠిన చర్యలు తీసుకోరాదని కూడా పంజాగుట్ట పోలీసులకు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. హరీశ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన చక్రధర్‌గౌడ్‌కు నోటీసులు జారీచేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆయనను ఆదేశించింది.