హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులతో కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ముఖాముఖి కార్యక్రమానికి అనుమతించేలా ఆదేశించాలని దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. వర్సిటీల్లో విద్యాబోధనే లక్ష్యంగా ఉండాలని, ఇతర ఏ కార్యక్రమాలకు అనుమతి ఇవ్వరాదని వ్యాఖ్యానించింది. ఈ నెల ఏడున ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో తలపెట్టిన కార్యక్రమానికి వర్సిటీ రిజిస్ట్రార్ అనుమతి నిరాకరించారు. దీనిని సవాల్ చేస్తూ ఎన్ఎస్యూఐ ప్రతినిధి మానవతా రాయ్ మరికొందరు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం బుధవారం విచారించింది.
ముఖాముఖి నిర్వహించేందుకు అనుమతి ఇవ్వలేమని వర్సిటీ రిజిస్ట్రార్ జారీచేసిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని తెలిపింది. వర్సిటీలో రాజకీయ పార్టీలు, మతపరమైన కార్యక్రమాలు, సభలు, సమావేశాలకు అనుమతి ఇవ్వరాదని 2021లో వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తీర్మానం చేసిందని, దీని ప్రకారం రాహుల్‌గాంధీ కార్యక్రమానికి అనుమతి ఇవ్వటం సాధ్యం కాదని వర్సిటీ తరఫు న్యాయవాది సీహెచ్ జగన్నాథరావు వాదించారు. పిటిషన్లు వేసినవారు వర్సిటీలో చదివే రెగ్యులర్ విద్యార్థులు కూడా కాదని తెలిపారు. సమావేశం వల్ల ఎంబీఏ పరీక్షలకు ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొన్నారు. ఈ వాదనతో ఏకీభవించిన ధర్మాసనం, పిటిషన్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. గతంలో కొందరు రాజకీయ నేతల పుట్టినరోజు వేడుకలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించారన్న కారణంతో ఇప్పుడు మరో రాజకీయ సభకు అనుమతి ఇవ్వటం సరికాదని వ్యాఖ్యానించింది. అన్ని వర్సిటీల్లో భవిష్యత్తులో రాజకీయ సభలకు అనుమతి ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది.