హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): గ్రామ పంచాయతీ ఎన్నికల విషయంలో దాఖలైన పిటిషన్లపై బుధవారం తీర్పు వెలువరించిన హైకోర్టు.. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన చర్యలను ప్రభుత్వం 30 రోజుల్లో పూర్తిచేయాలని, గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియను సెప్టెంబర్ 30వ తేదీలోగా ఎన్నికల సంఘం ముగించాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పును ప్రభుత్వం అమలు చేస్తుందా? లేదంటే అప్పీల్‌కు వెళ్తుందా? అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే, ప్రభుత్వం మాత్రం హైకోర్టు తీర్పును అమలుచేసేందుకే మొగ్గు చూపుతున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ఆ దిశగానే సర్కారు సమాలోచనలు చేస్తున్నదని కాంగ్రెస్ వర్గాలు సైతం ధ్రువీకరిస్తున్నాయి. రిజర్వేషన్లు మొత్తం 50% మించకూడదని ఇప్పటికే సుప్రీంకోర్టు అనేక షరతులు విధించింది. మరోవైపు కులగణనకు సాధికారత లేదని కేంద్రం స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో బీసీలకు 42% రిజర్వేషన్ అసాధ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
హైకోర్టు తీర్పుపై అప్పీల్‌కు వెళ్లినా ప్రయోజనం ఉండబోదని ప్రభుత్వం భావిస్తున్నట్టు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. అప్పీల్‌కు వెళ్లడం కంటే హైకోర్టు తీర్పునే సాకుగా చూపి, రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన తరుణంలోనే ఎన్నికల ప్రక్రియను ముగించాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తున్నది.
మరొక వర్గం మాత్రం ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్తుందని, లేదంటే బీసీల నుంచి వ్యతిరేకత మూటగట్టుకోవాల్సి వస్తుందని చెప్తున్నది. లేదంటే బీసీ రిజర్వేషన్లను అమలు చేస్తూ జీవో విడుదలచేస్తుందని, ఒకవేళ కోర్టు ఈ జీవోను కొట్టివేస్తే ఆ నెపాన్ని కోర్టుపైనే నెట్టవచ్చని, మరోవైపు అమలు చేసేందుకు యత్నించామని బీసీలను నమ్మించవచ్చనే దిశగా సమాలోచనలు జరుగుతున్నట్టు తెలుస్తున్నది.