హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి అందించిన నివేదికపై చర్యలు తీసుకోకుండా నివేదిక అమలును నిలిపివేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు హైకోర్టులో వేర్వేరుగా అనుబంధ పిటిషన్లు (ఐఏ) దాఖలు చేశారు. కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వం గత ఏడాది మార్చి 14న జారీ చేసిన జీవో 6 అమలును నిలిపివేయాలనే ప్రధాన పిటిషన్లు విచారణలో ఉండగా ఐఏలను దాఖలు చేశారు. అసెంబ్లీలో నివేదిక ప్రవేశపెట్టాక చర్చించాకే తదుపరి చర్యలు ఉంటాయని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి హైకోర్టుకు హామీ ఇచ్చిన విషయాన్ని ఐఏల్లో ప్రస్తావించారు. కమిషన్ జూలై 31న ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని, అయితే, కమిషన్ పిటిషనర్లను సాక్షులుగా పిలిచిందని, తీరా నివేదికలోని అంశాలను సీఎం రేవంత్‌రెడ్డి ఆగస్టు 4న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మీడియాకు వెల్లడించారని, పిటిషనర్లపై పక్షపాతంతో, చట్టవిరుద్ధంగా, అవమానకరంగా, పరువు నష్టం కలిగించే విధంగా తీవ్రవ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.
అసెంబ్లీలో నివేదిక ప్రవేశపెట్టకముందే ప్రభుత్వం అధికారికంగా నివేదికను సంక్షిప్తం చేయించిన వాటిలోని కీలక విషయాలను బహిర్గతం చేసి తమ పరువు ప్రతిష్టలను దెబ్బతీసిందని పేర్కొన్నారు. సీఎం చర్యలు చట్ట వ్యతిరేకంగా, పిటిషనర్లపై కక్షపూరితంగా ఉన్నాయని, తమ స్థాయిని దెబ్బతీసేలా ఉన్నాయని వివరించారు. నివేదిక అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. పిటిషనర్లపై చర్యలు తీసుకోవాలనే రాజకీయ కుట్రతో ప్రభుత్వం ఉం దన్నారు. పిటిషనర్లపై చర్యలకు ఆసారం ఉంటుందని, తమ ప్రతిష్టను దెబ్బతీయడానికి కుట్ర జరుగుతోందన్నారు. తమపై చర్యలు తీసుకోకుండా రక్షణ కల్పించాలని కోరారు. ఇందులో ప్రతివాదులుగా నీటిపారుదల శాఖ కార్యదర్శి, కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్లను చేర్చారు.