Congress | హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వానికి చెందిన హెలికాప్టర్‌ను కాంగ్రెస్ పార్టీ ఇంటి వాహనంగా వాడుకుంటున్నదా? బుధవారం కేరళలోని వయనాడ్‌లో ప్రియాంక గాంధీ నామినేషన్ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ హెలికాప్టర్‌ను వాడుకున్నారా? ఇవే సందేహాలు వ్యక్తంచేస్తూ బుధవారం సోషల్‌మీడియాలో పలు పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. బుధవారం ప్రియాంకాగాంధీ వయనాడ్ నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమం కోసం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, నేతలు రాహుల్, కేసీ వేణుగోపాల్ తదితరులు హెలికాప్టర్లో వయనాడ్ చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు బయటకు రావడంతో కాంగ్రెస్ నేతలు వినియోగించిన హెలికాప్టర్.. తెలంగాణ ప్రభుత్వ హెలికాప్టరేనంటూ ప్రచారం మొదలైంది.
తెలంగాణ సీఎం, మంత్రులు, ఉన్నతాధికారులు వినియోగించాల్సిన హెలికాప్టర్‌ను కాంగ్రెస్ అగ్ర నేతల కోసం వాడుతారంటూ నెటిజన్ల నుంచి విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ఇటీవల ఖమ్మం వరదలప్పుడు ప్రజలను ఆదుకోవడానికి రాని హెలికాప్టర్.. కాంగ్రెస్ నాయకుల చక్కర్లకు మాత్రం ఇలా ఉపయోగపడుతుందని అనుకోలేదంటూ నెటిజన్ ఒకరు వ్యంగ్యంగా ఎత్తిపొడిచారు. ఇటీవలికాలంలో హెలికాప్టర్ పర్యటనలపై కాంగ్రెస్ ప్రభుత్వంలో రచ్చ జరుగుతున్నది. తనకు అవసరమైనప్పుడు హెలికాప్టర్ ఇవ్వలేదని ఓ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్‌పైనే ఆగ్రహం వ్యక్తంచేసినట్టు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో వయనాడ్‌లో ప్రభుత్వ హెలికాప్టర్ కాంగ్రెస్ నేతలతో చక్కర్లు కొడుతున్నదంటూ వార్త వెలువడటం గమనార్హం.
నాలుగోసారి రేవంత్‌రెడ్డి కేరళ పర్యటన
సీఎం రేవంత్‌రెడ్డి కేరళ పర్యటన ముగిసింది. మంగళవారం సాయంత్రం బయల్దేరి వెళ్లిన ఆయన బుధవారం రాత్రి తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటినుంచి రేవంత్ ఇప్పటివరకు నాలుగుసార్లు కేరళలో పర్యటించారు. ఢిల్లీ తర్వాత అత్యధికసార్లు ఆయన కేరళలోనే పర్యటించారని తెలుస్తున్నది.