హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో నైరుతి రుతుపవనాల వల్ల ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం లేదని వాతావరణ శాఖ వెల్లడించింది. వానలకు ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవని, వచ్చే నెల రెండో వారం వరకు భారీ వర్షాలు పడే సూచనలు కనిపించడం లేదని పేర్కొంది. రుతుపవనాల సమయంలో అల్పపీడనాలు ఏర్పడటం సర్వసాధారణమని, కానీ నెల రోజుల నుంచి ఇవి ఏర్పడకపోవడంతోనే వానలపై ప్రభావం పడుతున్నదని తెలిపింది. కొన్ని జిల్లాల్లో మోస్తరు వానలు పడుతాయని అంచనా వేసింది. జూన్లో రాష్ట్రంలో 20 శాతం, జూలైలో ఇప్పటి వరకు 15 శాతం లోటు వర్షపాతం నమోదైందని వివరించింది.
ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఈ నెల 15 వరకు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నదని వాతావరణ శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసినట్టు తెలిపింది. ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేటలో అత్యధికంగా 6.44 సెంటీమీటర్ల వర్షం కురిసిందని పేర్కొంది. శనివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో వర్షాలు కురిసే అవకాశమున్నట్టు అంచనా వేసింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. జూలైలో కూడా రాష్ట్రంలోని 15 జిల్లాల పరిధిలో గల 311 మండలాల్లో లోటు వర్షపాతం కొనసాగుతున్నది.