హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు ఠారెత్తిస్తున్నాయి. 43-45 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఉదయం 10 గంటలు దాటిందంటే బయట అడుగుపెట్టాలంటేనే జనం జంకుతున్నారు. పరిస్థితులిలా ఉంటే.. రాష్ట్రంలోని డిగ్రీ, ఇంజినీరింగ్ విద్యార్థులకు తంటాలు తప్పడంలేదు. పాఠశాల, ఇంటర్ విద్యార్థులకు సర్కార్ వేసవి సెలవులిచ్చింది. డిగ్రీ, ఇంజినీరింగ్ విద్యార్థులకు సమ్మర్ సెలవుల్లేక విద్యార్థులు విలవిల్లాడుతున్నారు.
సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా ఉండటంతో ఉక్కపోతల మధ్యే పిల్లలు పరీక్షలు రాయాల్సి వస్తుంది. విద్యార్థులు తరగతి గదుల్లో ఉడికిపోతున్నారు. ఫ్యాకల్టీ చెప్పిన పాఠాలను బుర్రకెక్కించుకోలేకపోతున్నారు. కొందరు విద్యార్థులు వడదెబ్బ బారినపడుతున్నారు. అధికారులు అడ్మిషన్లు త్వరగా పూర్తిచేసి, విద్యాసంవత్సరాన్ని ముందుకు జరిపి, మే మాసంలో సెలవులివ్వాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.