హైదరాబాద్: దగ్గు సిరప్ (Cough Syrup) కారణంగా చిన్నారులు మృత్యువాత పడుతున్నారు. కోల్డ్రిఫ్ దగ్గు మందును (Coldrif Syrup) వాడటంతో మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో సుమారు 14 మంది మరణించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమయింది. రెండేండ్లలోపు చిన్నారులకు దగ్గు, సర్ది సిరప్లు ఇవ్వొద్దని సూచించింది. ఈ మేరకు దగ్గు సిరప్ విషయంలో జాగ్రత్తలు పాటించాలని మార్గదర్శకాలు విడుదల చేసింది. సర్ది, దగ్గు తాత్కాలిమేనని, ఎక్కువ శాతం కేసులు స్వయంగానే తగ్గుతాయని జిల్లా వైద్యాధికారులకు (DMHO) హెల్త్ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేట్, ప్రభుత్వ దవాఖానలన్నిటికీ ఆదేశాలు చేరవేయాలని సూచించారు.
దగ్గు తగ్గించేందుకు మొదట హోమ్ కేర్, పానీయాలు, విశ్రాంతి అవసరమని తెలిపారు. జీఎంపీ ప్రమాణాలతో తయారైన సిరప్లను మాత్రమే వాడాలని స్పష్టం చేశారు. అడల్టరేషన్ ఉన్న కోల్డ్రిఫ్ సిరప్ వాడొద్దని సూచించారు. బ్యాచ్ నంబర్ ఎస్ఆర్-13, మే 2025 తయారీ, ఏప్రిల్ 2027 గడువు ఉన్న సిరప్ రీకాల్ చేయాలని ఆదేశించారు. ఈ సిరప్లో ప్రమాదకరమైన డైఇథిలీన్ గ్లైకాల్ కలుషితం ఉన్నట్లు అనుమానం వ్యక్తమవుతున్నదని పేర్కొన్నారు. సిరప్ ఉన్నవారు వెంటనే స్థానిక డ్రగ్ కంట్రోల్ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్ని జిల్లా వైద్యాధికారులకు ఆదేశించారు. మరింత సమాచారం కోసం 1800-599-6969 టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశారు.