హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ) : రుతుపవనాలు మళ్లీ బలపడుతున్నాయని, దీని ప్రభావంతో రాబోయే మూడు రోజులు దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య, ఉత్తరాది రాష్ర్టాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, దక్షిణాది రాష్ర్టాలైన తెలంగాణ, ఏపీల్లో రాబోయే 3రోజులు పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు.
దేశంలో 70శాతం మేఘాలు కమ్ముకున్నట్టు ఇస్రో శాటిలైట్ చిత్రాలు స్పష్టంగా సూచిస్తున్నాయని అధికారులు వెల్లడించారు. ఆవర్తన ద్రోణి ప్రభావంతో మూడు రోజులు ఉత్తర తెలంగాణ, ఈశాన్య జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని, గంటకు 30-40 కి.మీ వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నదని తెలిపారు.