కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై చేసిన ఆరోపణలు నిరాధారమని హైకోర్టు తీర్పుతో స్పష్టమైంది. ఇప్పటికైనా కాంగ్రెస్, బీజేపీలకు కనువిప్పు కలగాలి. పీసీ ఘోష్ కమిషన్ నివేదికకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయం. న్యాయం గెలిచింది. కమిషన్ విచారణలో ప్రాథమిక నిబంధనలు పాటించలేదని కోర్టు స్పష్టం చేయడం ద్వారా ఆ నివేదికకు చట్టపరమైన ప్రాముఖ్యత లేదని తేలింది. ముఖ్యంగా సెక్షన్ 8 కింద సంబంధిత వ్యక్తులకు నోటీసులు ఇవ్వకుండా ఆరోపణలు చేయడం సరికాదని కోర్టు వ్యాఖ్యానించడం అత్యంత కీలకం. బీఆర్ఎస్ పార్టీ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ట దెబ్బ తీయాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్, బీజేపీలు కక్షపూరితంగా వ్యవహరించాయి. ప్రాజెక్టు మరమ్మతులను సకాలంలో చేపట్టకుండా దాదాపు రెండున్నరేండ్లు ఆలస్యం చేశారు. చివరకు గత్యంతరం లేక ఇప్పుడు పనులు చేపడుతున్నారు. కాంగ్రెస్ రాజకీయ వేధింపులను పక్కన బెట్టి పాలనపై దృష్టి సారించాలి.
రాజకీయ అవసరాల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టుపై అసత్య ప్రచారం చేశారు. ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన ‘స్టే’ బీఆర్ఎస్ నిజాయితీకి నిదర్శనం. రాజకీయ కక్ష సాధింపు కోసం కాంగ్రెస్ వ్యవస్థలను దుర్వినియోగం చేసి రైతులను ఆగం చేసింది. రెండున్నరేండ్లుగా కల్పతరువు లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టిన రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాసి రైతులకు క్షమాపణ చెప్పాలి.

అది పీసీ ఘోష్ కమిషన్ కాదని.. పీసీసీ నివేదిక అని బీఆర్ఎస్ పార్టీ చెప్పిందే నిజమైంది. ఇప్పటికైనా మేడిగడ్డ బ్యారేజీలో స్వల్పంగా దెబ్బతిన్న రెండు పిల్లర్లను రిపేర్ చేసి, రైతుల సాగునీటి కష్టాలు తీర్చాలి. గోదావరి జలాలను పక్క రాష్ర్టానికి దోచిపెట్టాలని చూస్తే రేవంత్ సర్కార్‌ను రైతులు ఉరికించి కొట్టే రోజులు తప్పవు. ప్రాజెక్టుల నిర్వహణలో సర్కార్ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా రాష్ట్ర రైతాంగం తరఫున బీఆర్ఎస్ పార్టీ పోరాటం కొనసాగుతుంది.
కాళేశ్వరంపై హైకోర్టు తీర్పుతోనైనా కాంగ్రెస్‌కు బుద్ధిరావాలి. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం లేదని వెలువడ్డ తీర్పును స్వాగతిస్తున్నాం. తెలంగాణ జీవనాధార కాళేశ్వరంపై నిందలు మోపి కేసీఆర్ ప్రతిష్టను దెబ్బ తీసేందుకు కాంగ్రెస్, బీజేపీలు చేసిన కుట్రలు పటాపంచలయ్యాయి.

రెండున్నరేండ్లుగా మరమ్మతులు చేపట్టకుండా కుట్రతోనే అడ్డుకున్నారు. చివరకు గత్యంతరం లేక మరమ్మతులకు సిద్ధమయ్యారు. కాళేశ్వరం విషయంలో కేసీఆర్‌పై చేసిన ఆరోపణలకు కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణ ప్రజలకు, రైతాంగానికి క్షమాపణలు చెప్పాలి.
కాళేశ్వరం పథకానికి సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై హైకోర్టు వెలువరించిన తీర్పును స్వాగతిస్తున్నాం. కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుపై ఎలాంటి చర్యలు చేపట్టవద్దని న్యాయస్థానం ఆదేశాలు ఇవ్వడం అభినందనీయం.

విచారణ సందర్భంగా కమిషన్ ప్రాథమిక న్యాయసూత్రాలు, నిబంధనలు పాటించలేదని తీర్పులో పేర్కొనడం నివేదికకు చట్టబద్ధత లేదనేది తేటతెల్లమైంది. ముఖ్యంగా సెక్షన్ 8 కింద ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కేవలం ఆరోపణలు చేయడం సమంజసం కాదని కోర్టు స్పష్టం చేయడం మంచి పరిణామం.