హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ)/నాంపల్లి కోర్టులు : టీఎస్పీఎస్సీ ఏఈ పేపర్ కొనుగోలు చేసి ఇటీవల అరెస్టయిన మైబయ్య, అతని కొడుకు జనార్దన్‌ను మూడురోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. దీంతో వారిద్దరినీ శుక్రవారం చంచల్‌గూడ జైలు నుంచి అధికారులు సిట్ కార్యాలయానికి తరలించారు. నిందితుల విచారణలో క్రమంలో సిట్‌కు ఈ ఇద్దరి సమాచారం దొరికింది. సోమవారం వరకు వీరిని విచారించనున్నారు.
లీకేజీ కేసులో ఐదుగురు నిందితులను కస్టడీకి ఇవ్వాలన్న ఈడీ వాదనలు పూర్తయ్యా యి. నిందితుల తరఫు న్యాయవాదులకు ఈడీ పీపీ నోటీసులు జారీ చేశారు. సిట్ కొనసాగిస్తున్న విచారణను అడ్డుకోవడం లేదని, వాంగ్మూలాలను సేకరించేందుకే అనుమతివ్వాలని ఈడీ పీపీ జగనమోహన్ శుక్రవారం కోర్టుకు తెలిపారు. ఈడీ చట్టం ప్రకారం ఈ అంశం మెజిస్ట్రేట్ కోర్టు పరిధిలోకి రాదని, జిల్లా కోర్టును ఆశ్రయించాలని సిట్ పీపీ కృష్టయ్య కోరారు. కౌంటర్లో అన్ని విషయాలను వివరించినట్టు తెలిపారు. కోర్టు తీర్పును సోమవారానికి వాయిదా వేశారు.