Jazeera Airways : ఇరాన్ యుద్ధ సంక్షోభ సమయంలో కువైట్-ఇండియా మధ్య విమాన సర్వీసులపై భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జజీరా ఎయిర్వేస్కు ప్రత్యేక అనుమతి ఇచ్చి ఇరు దేశాల మధ్య విమానాలు నడిపేందుకు అంగీకరించింది. దీంతో ఇరు దేశాల మధ్య, జజీరా ఎయిర్వేస్ విమాన సర్వీసులు ప్రారంభం కాబోతున్నాయి. ప్రాంతీయ వైమానిక మార్గాల మూసివేత కారణంగా ఏర్పడిన ప్రయాణ సమస్యలను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కువైట్‌లో భారత రాయబారి పరమితా త్రిపాఠి వెల్లడించారు.
గురువారం సాయంత్రం భారత రాయబార కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ఇరాన్ యుద్ధం కారణంగా 2026 ఫిబ్రవరి 28 నుండి కువైట్ వైమానిక మార్గాలు తాత్కాలికంగా మూసివేశారు. దీంతో అత్యవసరంగా భారత్‌కు వెళ్లాల్సిన ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ పరిస్థితిలో, భారత రాయబార కార్యాలయం నిరంతరం అధికారులతో సంప్రదింపులు కొనసాగిస్తూ సహాయం అందిస్తోంది. “అత్యవసర ప్రయాణం అవసరమైన వారికి, సౌదీ విమానాశ్రయాల ద్వారా ట్రాన్సిట్ సౌకర్యం కల్పిస్తున్నాం. దీనిలో భాగంగా రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం, సౌదీ ప్రభుత్వంతో సమన్వయం చేస్తూ ఇప్పటివరకు 1,100 మందికి పైగా భారతీయులకు సౌదీ ట్రాన్సిట్ వీసాలు పొందేలా సహాయం చేశాం” అని ఆమె తెలిపారు.
అలాగే, మానవతా కారణాల దృష్ట్యా మరణించిన వారి మృతదేహాలను భారత్‌కు తరలించే ప్రక్రియలో కూడా కువైట్ అధికారులతో కలిసి పని చేస్తున్నామని తెలిపారు. “ఇప్పటివరకు 17 మృతదేహాలను భారత్‌కు పంపించాం. ఈ ప్రక్రియను తక్కువ సమయంలో పూర్తి చేయగలిగాం” అని త్రిపాఠి అన్నారు.