హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ) : ఎస్సీ వర్గీకరణ చట్టానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీచేసింది. మరోవైపు దోస్త్ ద్వారా జరుగుతున్న అడ్మిషన్ల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని సవాలు చేస్తూ మాల మహానాడు తరఫున అధ్యక్షుడు జీ చెన్నయ్య, షెడ్యూల్ కులాల ఐక్య వేదిక తరపున ఉపాధ్యక్షుడు గడ్డం శంకర్ వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు బుధవారం మరోసారి విచారణ జరిపింది. వేసవి సెలవుల తర్వాత విచారణ కొనసాగుతుందని, ఈ లోగా ప్రభుత్వం తమ వాదనలతో కౌంటర్ దాఖలు చేయాలని న్యాయమూర్తులు జస్టిస్ పుల్లా కార్తీక్, జస్టిస్ నందికొండ నర్సింగ్‌రావుతో కూడిన వేసవి సెలవుల ప్రత్యేక డివిజన్ బెంచ్ ప్రకటించింది.
తొలుత పిటిషనర్ల తరపున విద్యాసాగర్ ఇతర సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ, ఎస్సీ వర్గీకరణ చట్టంతోపాటు దాని అమలుకు సంబంధించి ప్రభుత్వం జారీచేసిన జీవో 33, జీవో 9, 10, 99 అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని కోరారు. ప్రస్తుతం పలు విశ్వవిద్యాలయాల పరిధిలో డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి దోస్త్ తొలి దశ అడ్మిషన్లు కొనసాగుతున్నాయని, జూన్ 13న తరగతులు ప్రారంభం కానున్నాయని, ఆ అడ్మిషన్లలో ఎస్సీ వర్గీకరణ చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. కనీసం సీట్ల కేటాయింపు చేయకుండా ఆదేశాలివ్వాలని కూడా కోరారు. అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి ప్రతివాదన చేస్తూ, మధ్యంతర ఉత్తర్వులు ఇస్తే దోస్త్ అడ్మిషన్లకు అవరోధాలు ఏర్పడతాయని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
పిటిషనర్లు చట్టాన్ని సవాల్ చేసిన సందర్భంలో కోర్టులు ఏవిధమైన మధ్యంతర ఉత్తర్వుల జారీకి ఆసారం ఉండదని అన్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు పలుమార్లు ఉత్తర్వులు జారీచేసిందని గుర్తు చేశారు. అడ్మిషన్ల ప్రక్రియ యూనివర్సిటీల పరిధిలోనిదని, విద్యా సంవత్సరం షెడ్యూలు ప్రకారం అడ్మిషన్లు కొనసాగిస్తాయని చెప్పారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోరాదని కోరారు. వాదనల అనంతరం హైకోర్టు, ఎస్సీ వర్గీకరణతోపాటు పిటిషనర్లు లేవనెత్తిన అన్ని అభ్యంతరాలపై సమగ్ర వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దోస్త్ అడ్మిషన్ల ప్రక్రియను నిలుపుదల చేసేందుకు ఉత్తర్వులు జారీ చేయబోమని తేల్చి చెప్పింది. తదుపరి విచారణను జూన్ 10వ తేదీకి వాయిదా వేసింది.
హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): వేసవి సెలవుల్లో ప్రైవేటు కాలేజీలు తరగతులు నిర్వహిస్తున్నాయంటూ ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేసిన పిటిషనర్లపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషనర్లు బాధితులు కానప్పుడు హైకోర్టుకు ఎలా వస్తారని జస్టిస్ పుల్లా కార్తీక్, జస్టిస్ నందికొండ నర్సింగరావు ధర్మాసనం ప్రశ్నించింది. వేసవిలో తరగతులు నిర్వహించడం వల్ల విద్యార్థులు ఇబ్బంది పడితే వాళ్లు లేదా వాళ్ల తల్లిదండ్రులు కాకుండా మీరెలా కోర్టుకు వస్తారని నిలదీసింది. తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది.