హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): ఓ వ్యక్తిని కోల్పోయిన కుటుంబం కోలుకోడానికి ఏడాది సమయం పడుతుందని, దీనిని పరిగణించకుండా కేంద్ర ప్రభుత్వం మోటారు వాహన చట్టం నిబంధనను సవరించడం సరికాదని రాష్ట్ర హైకోర్టు పేర్కొన్నది. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మరణిస్తే అతని కుటుంబసభ్యులు ఏడాదిలోగా కింది కోర్టులో దావా వేసుకొనేలా ఉన్న మోటారు వాహన చట్ట నిబంధనను సవరించడాన్ని తప్పు పట్టింది. వ్యక్తిని కోల్పోయిన కుటుంబం కోలుకోడానికి కనీసం ఏడాది సమయం పడుతుందని, కానీ ఆరు నెలల్లోగానే దావా వేయాలంటూ నిబంధనను సవరించడం సరికాదని అభిప్రాయపడింది. ఈ వ్యవహారంపై సమగ్ర వివరాలను అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ టీ తుకారాంజీతో కూడిన ధర్మాసనం గురువారం కేంద్ర న్యాయ శాఖ ముఖ్యకార్యదర్శి, నిజామాబాద్ మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ చైర్మన్లకు నోటీసులు జారీచేసింది. నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలం అమ్రాద్ గ్రామానికి చెందిన అయిటి నవనీత వేసిన పిటిషన్ను స్వీకరించేందుకు స్థానిక కోర్టు నిరాకరించింది. రోడ్డు ప్రమాదం జరిగి ఆరు నెలలు దాటినందున నిబంధనల ప్రకారం పిటిషన్పై విచారణ చేపట్టడం కుదరదని తెలిపింది. దీంతో నవనీత, మరొకరు హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం మోటారు వాహన చట్ట నిబంధనను సవరించడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. వారి తరఫు న్యాయవాది కురిటి భాసర్రావు వాదనలు వినిపిస్తూ, రోడ్డు ప్రమాదంలో ఆప్తులను కోల్పోయిన కుటుంబం కోలుకొని కేసు వేసేందుకు ఏడాది సమయమే తకువని, దీనిని ఆరు నెలలకు కుదించడాన్ని రద్దు చేయాలని కోరారు. కింది కోర్టు తమ పిటిషన్ స్వీకరించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. కౌంటర్ దాఖలు చేస్తామని కేంద్రం తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ గాడి ప్రవీణ్ కుమార్ చెప్పారు. వాదనల తర్వాత హైకోర్టు, తదుపరి విచారణను ఫిబ్రవరి రెండుకు వాయిదా వేసింది.