వచ్చే విద్యాసంవత్సరంలో ప్రవేశాలు పొందే విద్యార్థులూ.. మీకో అలర్ట్. ఇక మీ కోర్సు ఫీజులను మీరు కట్టుకోవాల్సిందే. మీకు ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించినా.. వర్తించకపోయినా మీ ఫీజులను మీరు చెల్లించాల్సిందే. ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందిన వారైనా? మీ వార్షికాదాయం రూ.2లక్షల లోపు ఉన్నా.. ఇవేం పనికి రావు!
ఇంజినీరింగ్‌లో చేరాలంటే గరిష్ఠంగా ఒక ఏడాదికి రూ.1.8లక్షలు సిద్ధం చేసుకోవాలి. ఫీజు కట్టకపోతే వచ్చిన సీటును కోల్పోవాల్సిందే. ఈ పరిస్థితిని తీసుకొచ్చిందెవరో కాదు సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వమే. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ సర్కారే ఈ పరిస్థితికి కారణం.
హైదరాబాద్, ఏప్రిల్ 20(నమస్తే తెలంగాణ) : ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై పది రోజుల క్రితం తెలంగాణ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. 2026-27 విద్యాసంవత్సరం నుంచి విద్యార్థుల నుంచి కాలేజీలు ఫీజులు వసూలు చేసుకోవచ్చని మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. విచారణ సమయంలో హైకోర్టు అడిగినప్పుడు సర్కార్ నుంచి కచ్చితమైన సమాధానం రాలేదు. ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ సరైన వాదనలు వినిపించలేదు. అంతేకాదు.. ఈ కేసులో ప్రభుత్వం కనీసం హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయలేదు. అంతేకాదు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఇంతవరకు అప్పీల్‌కు వెళ్లలేదు, రివ్యూ పిటిషన్ దాఖలు చేయలేదు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఇలా వ్యవహరించిందంటూ విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.ఇప్పటివరకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే. ఇదే విషయాన్ని జీవో-50, జీవో-18లు స్పష్టంగా చెబుతున్నాయి. కానీ ఇప్పుడు విద్యార్థులు చెల్లించుకోవాల్సిన స్థితికి చేరింది.రాష్ట్రంలోని ప్రొఫెషనల్ కాలేజీల ట్యూషన్ ఫీజులను కాంగ్రెస్ సర్కార్ ఇటీవలే పెంచింది.
ఇంజినీరింగ్, ఫార్మసీ, బీఈడీ, ఎంఈడీ, బీపీఈడీ, లా వంటి కోర్సుల ఫీజులను పెంచుతూ జీవోలు కూడా విడుదల చేసింది. 2026-27, 2027-28, 2028-29 మూడు విద్యాసంవత్సరాలకు సంబంధించిన ఫీజులను పెంచేసింది. ఒక్క ఇంజినీరింగ్ విషయమే తీసుకుంటే ఏకంగా 63 కాలేజీల్లో ఫీజులు పెరిగాయి. ఒక కాలేజీలో అయితే గరిష్ఠంగా రూ.62వేలు పెంచారు. రెండు కాలేజీల్లో రూ.30వేలు, ఏడు కాలేజీల్లో 20వేల చొప్పున ఫీజులు పెంచేశారు. కాలేజీలవారీగా పరిశీలిస్తే నారాయణమ్మ ఇంజినీరింగ్ కాలేజీ ఫీజు గతంలో లక్ష ఉంటే తాజాగా రూ.1.62 లక్షలకు పెంచారు. వాసవి కాలేజీలో రూ.1.40లక్షలుంటే.. 1.75లక్షలకు పెంచారు. గోకరాజు రంగరాజు కాలేజీలో రూ.30వేలు పెరుగగా, ఈ కాలేజీలో 1.30లక్షల నుంచి రూ.1.60లక్షలకు చేరింది. శ్రీదేవి కాలేజీలో రూ.1.10 లక్షల నుంచి రూ.1.37లక్షలకు పెంచారు. ఇప్పుడు విద్యార్థులే కట్టుకోవాలంటే ఈ కాలేజీల్లో చేరిన విద్యార్థులు తమ జేబు నుంచి కట్టాల్సిందే.
రాష్ట్రంలోని ప్రైవేట్ ప్రొఫెషనల్ కాలేజీల యాజమాన్యాలపై సర్కార్ గుర్రుగా ఉన్నది. బకాయిలు విడుదల చేయకపోవడంతో యాజమాన్యాలు రెండు సార్లు నిరవధిక బంద్ పాటించాయి. ఈ పరిణామాన్ని ప్రభుత్వం అస్సలు జీర్ణించుకోలేకపోతున్నది. కాలేజీల సమ్మెకు జడుసుకున్న సర్కార్ రూ.800కోట్లకు పైగా బకాయిలను విడుదల చేసింది. ఇది కూడా సర్కార్‌కు రుచించడం లేదు. ఈ క్రమంలో కాలేజీలపై ప్రభుత్వ కక్ష పెంచుకున్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో కీలక మార్పులు చేసేందుకు సర్కార్ సిద్ధమవుతున్నది. ఇకపై నేరుగా విద్యార్థుల ఖాతాల్లోనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను జమచేసేందుకు సమాయత్తమవుతున్నది. ఒకవేళ ఇదే జరిగితే. ఈ స్కీమ్ మరింత జఠిలం కావడం ఖాయంగా కనిపిస్తున్నది. ఉద్యోగుల బిల్లులు, రిటైర్మెంట్ బెనిఫిట్లు పెండింగ్‌లో ఉన్నట్టే ఇదే తరహాలో ఇవి కూడా చేరనున్నాయి. ఇదివరకు ఫీజు రీయింబర్స్మెంట్ కాలేజీల ఖాతాల్లో, స్కాలర్షిప్లు విద్యార్థుల ఖాతాల్లో జమ చేసేవారు. ఇక నుంచి మొత్తం విద్యార్థుల ఖాతాలోనే జమచేస్తే ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పుకొన్నట్టే. విద్యార్థులు కాలేజీలకు ఫీజులు కట్టిన తర్వాత సర్కార్ ఇస్తే.. ఇచ్చినట్టు. లేదంటే లేనట్టే. ఈ బకాయిలు కొండల్లా పేరుకుపోతే విద్యార్థులు మళ్లీ రోడ్డెక్కాల్సిన పరిస్థితులొస్తాయి.
రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా 14లక్షల మంది విద్యార్థులు లబ్ధిపొందుతున్నారు. రీయింబర్స్మెంట్ మొత్తాన్ని విద్యార్థుల ఖాతాల్లో వేస్తే అనేక సమస్యలు ఉత్పన్నం కానున్నాయి. విద్యార్థి కాలేజీలో చేరినప్పుడే ఏడాది ఫీజు కట్టాలి. ఇది తల్లిదండ్రులకు భారం. విద్యార్థి ఖాతాల్లో వేస్తే ఆయా మొత్తాన్ని వారు దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంది. తల్లిదండ్రులు అప్పోసప్పో చేసి తెస్తే.. వారికి అప్పగించకుండా సొంతానికి వాడుకుంటే ఈ పథకం ఉద్దేశం నీరుగారనుంది. ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో కేంద్రం వాటాను విద్యార్థుల ఖాతాల్లోనే వేస్తున్నది. దీనిని కొందరు దుర్వినియోగం చేసిన దాఖలాలున్నాయి. విద్యార్థుల ఖాతాల్లో వేయ డం నిష్ప్రయోజనమని విద్యార్థి సంఘా ల నాయకులు అభిప్రాయపడుతున్నారు.
