హైదరాబాద్, మార్చి 30(నమస్తే తెలంగాణ): శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సోమవారం ప్రవేశపెట్టిన హేట్‌స్పీచ్, ద్వేషపూరిత నేరాల నివారణ బిల్లును సభ ఆమోదించలేదు. బిల్లును సెలెక్ట్ కమిటీ పరిశీలనకు పంపుతూ సభ నిర్ణయం తీసుకున్నది. ఈ బిల్లు భావప్రకటనా స్వేచ్ఛను హరించేలా ఉన్నదని, ప్రజాస్వామ్యానికి ఇది గొడ్డలిపెట్టు వంటిదని ప్రతిపక్ష సభ్యులు ముక్తకంఠంతో వ్యతిరేకించారు. బిల్లులోని లోపాలను అధికారపక్ష సభ్యులతోపాటు విపక్ష సభ్యులు కూడాఎత్తిచూపారు. బిల్లుపై సభలో వాడీవేడి చర్చ జరిగింది. ఈ బిల్లులోని వివాదాస్పద నిబంధనలపై విపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేశారు. ఎట్టిపరిస్థితులోనూ బిల్లు ను ఆమోదించ వద్దని, సెలెక్ట్ కమిటీకి పం పాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో, బిల్లుకు తుది ఆమోదం తెలుపకుండా సమగ్ర పరిశీలన కోసం సెలెక్ట్ కమిటీకి పంపాలని శాసనసభ నిర్ణయించింది. విపక్షాల ఆందోళనలను పరిగణనలోకి తీసుకున్న అధికార పక్ష సభ్యులు కూడా ఈ బిల్లును లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. బిల్లును వెంటనే ఆమోదించకుండా సెలెక్ట్ కమిటీకి పంపాలని కాంగ్రెస్ సభ్యులు కూడా ప్రతిపాదించారు. ఈ మేరకు కమిటీని ఏర్పాటు చేయాలని స్పీకర్‌కు శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు విన్నవించారు. ప్రజాస్వామ్య స్ఫూ ర్తిని కాపాడుతూ, సభ్యులందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొనేందుకు ఈ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపుతున్నట్టు శాసనసభ ప్రకటించింది.
ఈ బిల్లు భావప్రకటనా స్వేచ్ఛకు డెత్ వారెంట్ లాంటిదని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అభివర్ణించా రు. కవులు, కళాకారులపై దాడిగా భావిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే ఉపా చ ట్టం, ఎన్ఐఏ ద్వారా అడ్డగోలుగా అరెస్టులు జరుగుతున్నాయని, ఈ బిల్లు చ ట్టంగా మారితే మరింత ప్రమాదకరం అవుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఒక వాట్సాప్ గ్రూపులో ఎవరో ఒకరు హేట్ స్పీచ్ పోస్ట్ చేస్తే, ఆ గ్రూపులోని సభ్యులందరినీ బాధ్యులను చేయడం ఏ రకమైన న్యాయం? అని ప్రశ్నించారు. తక్షణమే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
బిల్లులోని సెక్షన్లపై బీజేపీ ఎమ్మెల్యే ఏలే టి మహేశ్వర్‌రెడ్డి నిప్పులు చెరిగారు. బిల్లులోని సెక్షన్-4 సామాన్య ప్రజల స్వేచ్ఛకు సంకెళ్లు వేసేలా ఉంటే, సెక్షన్-8 మాత్రం అధికారులకు రక్షణ కవచంలా మారిందని ఆరోపించారు. ఈ బిల్లు కర్ణాటకలో చట్టంగా మారి అమల్లో ఉన్నదని, దీనివల్ల అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ సభ్యుడు పాయల్ శంకర్ విమర్శించారు. ఇది ప్రజలకు, ప్రభుత్వానికి ప్రమాదకరమని పేర్కొన్నారు.
భారత న్యాయ సంహిత(బీఎన్ఎస్)కు ఈ బిల్లుకు మధ్య తేడా ఏమిటని ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల ప్రశ్నించారు. హేట్‌స్పీచ్, ద్వేషపూరిత నేరాల నివారణ బిల్లు సెలక్ట్ కమిటీకి పంపాలని ప్రభుత్వానికి సూచించారు.
ప్రతిపక్షాలే కాకుండా, అధికార పక్షానికి చెందిన కొందరు సభ్యులు కూడా ఈ బిల్లులోని క్లిష్టతపై ఆందోళన వ్యక్తం చేశా రు. బిల్లులో మరిన్ని మార్పులు, చేర్పులు అవసరమని భావించిన కాంగ్రెస్ సభ్యు సమగ్రంగా పరిశీలించడానికి సెలెక్ట్ కమిటీకి పంపాలని సూచించారు. కాంగ్రెస్ సభ్యులు మట్టా రాగమయి, యశస్వినీరెడ్డి బిల్లుపై మాట్లాడుతూ.. బిల్లును సెలక్ట్ కమిటీ పంపి, సవరణలు చేయాలని సూ చించారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే బ త్తుల లక్ష్మారెడ్డి ఈ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపించాలని ప్రభుత్వాన్ని కోరారు.
సోమవారం ఉదయం 10గంటలకు శాసనసభ ప్రారంభం కాగానే తెలంగాణ విలువ ఆధారిత పన్ను(సవరణ) బిల్లు-2026ను మంత్రి జూపల్లి కృష్ణారావు సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై బీజేపీ, సీపీఐ, కాంగ్రెస్ సభ్యులు మాట్లాడారు. బీజేపీ సభ్యుడు పాయల్ శంకర్ మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్‌ను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకొని రావాలని కోరారు. పన్నుల ఎగవేతల వల్లే అదానీ, అంబానీ సంపన్నుల జాబితాలో టాప్‌లో ఉంటున్నారని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. బ్యారెల్ చమురు ధర ఎంత? కేంద్రం విధించే జీఎస్టీ ఎంత? రాష్ట్రం విధించే వ్యాట్ ఎం త? అనే వివరాలు వెల్లడించాలని కోరా రు. చమురు ఉత్పత్తులు, అమ్మకాలపై మానటరింగ్ వ్యవస్థ ఉండాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అభిప్రాయపడ్డారు. అందరి అభిప్రాయాలు విన్న తర్వాత బిల్లుకు సభ ఆమోదం తెలిపింది.