KCR | హైదరాబాద్, ఏప్రిల్ 1 ( నమస్తే తెలంగాణ ) : ‘కేసీఆర్ పాలనలో తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందింది.. ముఖ్యంగా ఆర్థిక వృద్ధిలో పరుగులు పెట్టింది’.. ఎందరో ఆర్థిక నిపుణులు, రాజకీయ విశ్లేషకులు చెప్పిన, చెప్తున్న ఈ మాటను ఇప్పుడు ఏఐ చాట్ బాట్ ‘గ్రోక్’ కూడా నిర్ధారించింది. 2014-2024 వరకు తెలంగాణ ఆర్థిక రంగం రెట్టించిన ఉత్సాహంతో పరుగులు పెట్టిందని స్పష్టం చేసింది. కొందరు ఔత్సాహికులు ‘ఎక్స్’లో ప్రశ్నలు అడగగా.. పదేండ్ల కేసీఆర్ పాలనలో సాధించిన ఆర్థిక విజయాలను గ్రోక్ వివరించింది. కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధికి కారణాలను వివరించాలని ఓ నెటిజన్ కోరగా.. తెలంగాణలో వివిధ రంగాల సమ్మిళిత అభివృద్ధి జరిగిందని గ్రోక్ తెలిపింది. తద్వారా తెలంగాణ అభివృద్ధి దేశానికి ఒక మాడల్‌గా నిలిచిందని పేరొన్నది. ఓవైపు వ్యవసాయం, మరోవైపు పరిశ్రమలు, ఇంకోవైపు నిర్మాణ రంగం, రియల్ ఎస్టేట్ రంగాలు అభివృద్ధి చెందడంతో రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరిగిందని చెప్పింది. పెట్టుబడులను ఆకర్షించే టీఎస్-ఐపాస్ వంటి విప్లవాత్మక సంసరణలు, యువ పారిశ్రామికవేత్తలను తయారుచేసే టీ హబ్, వీ హబ్ వంటి వినూత్న ఆవిషరణలు, ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి దోహదపడే టీ ప్రైడ్, దళితబంధు వంటి పథకాలు తెలంగాణను ఒక రోల్ మాడల్‌గా నిలిపినట్టు స్పష్టం చేసింది.
తెలంగాణ పదేండ్ల అభివృద్ధిలో హైదరాబాద్ అత్యంత కీలకపాత్ర పోషించిందని ఏఐ చాట్ బాట్ గ్రోక్ తెలిపింది. ఐటీ, ఐటీ ఆధారిత, ఫార్మా రంగాలతో మహానగరం ఆర్థిక శక్తి వనరు కేంద్రంగా మారినట్టు స్పష్టం చేసింది. 2013-14లో రూ.57,258 కోట్లుగా ఉన్న ఐటీ ఎగుమతులు.. 2023-24 నాటికి రూ.2,68,233 కోట్లకు చేరాయని వెల్లడించింది. సంవత్సరానికి సగటున 11.32% వృద్ధి రేటు సాధించినట్టు తెలిపింది.
‘నా అభిప్రాయం ప్రకారం కేసీఆర్ పాలనలో వ్యవసాయ రంగం సాధించిన విజయాలు ప్రశంసనీయం. రైతుబంధు వంటి పథకాలు రైతుల జీవన విధానంలో సానుకూల మార్పులు తెచ్చాయి. కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు దీర్ఘకాలిక వ్యవసాయ అభివృద్ధికి బాటలు వేశాయి’ అని గ్రోక్ ప్రశంసించింది. బీఆర్ఎస్ పాలనలో 2014-2023 మధ్యకాలంలో తెలంగాణ వ్యవసాయ రంగం గణనీయమైన విజయాలు సాధించిందని చెప్పింది. బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయాన్ని మొదటి ప్రాధాన్యంగా తీసుకొని అమలు చేసిన కొన్ని విధానాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాది వేశాయని పేర్కొన్నది.
బీఆర్ఎస్ ప్రభుత్వం సాగునీటి రంగాన్ని తమ ప్రాధాన్యంగా ఎంచుకొని భారీగా ఖర్చు చేసినట్టు గ్రోక్ తెలిపింది. ‘కేసీఆర్ ప్రభుత్వం సాగునీటి రంగంపై ప్రత్యేక దృష్టి సారించి, రూ.1.82 లక్షల కోట్లు ఖర్చు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు దీనికి ప్రధాన ఉదాహరణ. ఇది రాష్ట్రానికి గుండెకాయగా మారి, సాగు భూములకు నీటిని అందించింది’ అని పేరొన్నది. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి వంటి భారీ ప్రాజెక్టులతో పాటు అనేక ఇతర ప్రాజెక్టులను చేపట్టినట్టు చెప్పింది. ఇవి వ్యవసాయ భూములకు నీటి లభ్యతను గణనీయంగా పెంచాయని ప్రశంసించింది. ఒక కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితంగానే గోదావరి నది నీటిని ఉపయోగించి లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం పెరిగిందని చెప్పింది. మిషన్ కాకతీయ ద్వారా 46,000 చెరువులను పునరుద్ధరించారని తెలిపింది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరిగిందని, చిన్న, సన్నకారు రైతులకు సాగునీరు అందుబాటులోకి వచ్చిందని ప్రశంసించింది. ఇది వ్యవసాయ ఉత్పాదకతను మరింత పెంచడానికి సాయం చేసినట్టు తెలిపింది.
తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాలకు 24 గంటల నిరంతర విద్యుత్తు సరఫరా అందించి.. తెలంగాణ దేశంలోనే ఏకైక రాష్ట్రంగా గుర్తింపు పొందిందని అభినందించింది. దీనివల్ల వ్యవసాయం, పరిశ్రమలు తదితర రంగాలు స్థిరంగా అభివృద్ధి చెందాయని పేరొన్నది. డిమాండ్‌కు తగినట్టుగా విద్యుత్తు సరఫరా వ్యవస్థను పటిష్ఠం చేశారని తెలిపింది.
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం స్థిరమైన పాలన అందించిందని గ్రోక్ తెలిపింది. దీనివల్ల వినూత్న పాలసీలు, సంసరణల అమలు సమర్థవంతంగా జరిగిందని అభినందించింది. ఫలితంగా.. 2016 నుంచి తెలంగాణ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్‌లో టాప్-3లో నిలిచిందని చెప్పింది. 2019-2024 ఆగస్టు వరకు 7.77 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) ఆకర్షించినట్టు పేరొన్నది. ఐటీ రంగంలో గూగుల్, అమెజాన్, యాపిల్ వంటి దిగ్గజ సంస్థలు, పారిశ్రామికపరంగా రిలయన్స్, టాటా వంటి సంస్థలు తెలంగాణలో తమ కార్యకలాపాలను విస్తరించాయని పేరొన్నది. ఇది ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చిందని గ్రోక్ అభిప్రాయపడింది. భారీ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంతో అటు పట్టణ ప్రాంతాల్లో, ఇటు గ్రామీణ ప్రాంతాల్లోనూ గణనీయమైన వృద్ధి నమోదైనట్టు స్పష్టం చేసింది. స్థిరమైన ప్రభుత్వం, స్థిరమైన నిర్ణయాలు తెలంగాణ అభివృద్ధికి దోహదం చేసినట్టు వివరించింది.
2014-2024 మధ్యకాలంలో దేశంలో అత్యంత వేగంగా ఆర్థిక అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఒకటిగా తెలంగాణ నిలిచిందని గ్రోక్ తెలిపింది. తెలంగాణ సగటున 10-13% వార్షిక వృద్ధి రేటుతో ఆర్థికంగా బలపడిందని వెల్లడించింది. స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎస్డీపీ), తలసరి ఆదాయం గణనీయంగా పెరిగాయని వెల్లడించింది. వ్యవసాయం, సేవలు, పరిశ్రమల రంగాలు ఆర్థిక వృద్ధికి ముఖ్యమైన సహకారం అందించాయని చెప్పింది.
2014లో జీఎస్డీపీ సుమారు రూ.4.5 లక్షల కోట్లు కాగా.. 2023-24 నాటికి రూ.14.63 లక్షల కోట్లకు పెరిగినట్టు తెలిపింది. ఇది 2014తో పోలిస్తే దాదాపు మూడు రెట్లు అని వివరించింది. జీఎస్డీపీ సగటున ఏటా 13.9 శాతం వృద్ధిరేటును సాధించినట్టు తెలిపింది.
తలసరి ఆదాయం వృద్ధిలోనూ కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచినట్టు గ్రోక్ వెల్లడించింది. 2014-15లో రూ.1.24 లక్షలుగా ఉన్న తలసరి ఆదాయం 2023-24 నాటికి రూ.3.56 లక్షలకు చేరిందని పేరొన్నది. ఏటా సగటు వృద్ధిరేటు 12 శాతానికి మించి నమోదైనట్టు తెలిపింది. ఈ పెరుగుదల రాష్ట్రంలో జీవన ప్రమాణాలు మెరుగుపడటాన్ని సూచిస్తుందని స్పష్టం చేసింది.