Telangana | హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): గత పదేండ్లలో కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిందంటూ దుష్ప్రచారం చేసిన కాంగ్రెస్ సర్కారు ఎట్టకేలకు నిజాన్ని ఒప్పుకున్నది. రాష్ర్టాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి పథంలో నడిపిందని స్వయంగా ప్రకటించింది. అంతేకాకుండా ఈ అభివృద్ధి ఏ ఒక్క రంగానికో పరిమితం కాలేదని, ప్రాథమిక, ద్వితీయ, తృతీయ (సేవా) రంగాల్లో సమాన వృద్ధి సాధిస్తూ పదేండ్లలో తెలంగాణ సమతుల వృద్ధిని సాధించిందని అంతర్జాతీయ వేదికపై వెల్లడించింది. ఈ నెల 5న హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో జరిగిన ‘గ్లోబల్ ఏఐ సమ్మిట్’లో రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ గ్రోత్ స్టోరీ’ పేరుతో ఓ నివేదిక విడుదలచేసింది. స్వరాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు తెలంగాణ సాధించిన ప్రగతిని ఆ నివేదికలో వివరించింది. 2014 నుంచి తెలంగాణలో ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాలు గణనీయ వృద్ధి సాధించాయని పేర్కొన్నది. ముఖ్యంగా వ్యవసాయ రంగం గణనీయ వృద్ధిని సాధించిందని, పారిశ్రామిక రంగం పరుగులు పెట్టిందని, సేవల రంగంలో తెలంగాణ దేశానికే రాజధానిగా మారిందని స్పష్టం చేసింది.
తెలంగాణ ఏర్పటినప్పటి నుంచి ఆర్థికంగా స్థిరమైన వృద్ధిని సాధించినట్టు రేవంత్‌రెడ్డి సర్కారు తెలిపింది. 2015లో 50 బిలియన్ డాలర్లకు దిగువన ఉన్న రాష్ట్ర సంపద (జీఎస్డీపీ).. 2024 నాటికి 194 బిలియన్ డాలర్లకు చేరుకున్నదని, ఈ పదేండ్లలో సగటున 12.5% వృద్ధిరేటును నమోదు చేసిందని వెల్లడించింది. కొవిడ్ వల్ల ప్రభావిత సంవత్సరాలను పక్కనపెడితే తెలంగాణ ఆర్థిక వృద్ధి 14% మేరకు ఉంటుందని స్పష్టం చేసింది.
బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయరంగం రూపురేఖలు మారిపోయాయని ‘గ్రోత్ స్టోరీ’లో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వెల్లడించింది. 2014 నాటికి తెలంగాణలో 1.3 కోట్ల ఎకరాలుగా ఉన్న సాగు విస్తీర్ణం 2021-23 నాటికి 2.3 కోట్ల ఎకరాలకు పెరిగినట్టు ప్రకటించింది. తద్వారా రాష్ట్రంలో సాగు విస్తీర్ణం ఎనిమిదేండ్లలోనే కోటి ఎకరాలు పెరిగినట్టు అంగీకరించింది. ఇదే సమయంలో ధాన్యం ఉత్పత్తి 68 లక్షల టన్నుల నుంచి 2.5 కోట్ల టన్నులకు, మొత్తం వ్యవసాయ ఉత్పత్తులు 3.5 కోట్ల టన్నులకు పెరిగినట్టు స్పష్టంచేసింది. 11వ అగ్రికల్చర్ సెన్సస్ ప్రకా రం 2021-22 నాటికే తెలంగాణ వ్యవసాయ, అనుబంధ ఉత్పత్తుల ఎగుమతుల విలువ 808 మిలియన్ డాలర్లుగా ఉన్నట్టు వెల్లడించింది. ప్రాథమిక రంగంలో రాష్ట్రం సాధించిన ప్రగతి పెట్టుబడిదారులను విశేషంగా ఆకర్షించిందని, 2023 ఏప్రిల్‌లో హైదరాబాద్‌లో నిర్వహించిన ‘ఫుడ్ కాంక్లేవ్’లో 886 మిలియన్ డాలర్ల పెట్టుబడులు రావడంతోపాటు దాదాపు 58 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా ఒప్పందాలు జరిగాయని పేర్కొన్నది. ఇక మసాలా దినుసులు, గుడ్ల ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో, మాంసం ఉత్పత్తిలో ఐదోస్థానంలో నిలిచినట్టు ఆ నివేదిక పేర్కొన్నది.
స్వరాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ ఆర్థికాభివృద్ధికి సేవల రంగం మూల స్తంభంగా నిలిచిందని, గ్రాస్ స్టేట్ వ్యాల్యూ యాడెడ్ (జీఎస్వీఏ)లో ఈ రంగం వాటా 60 శాతానికిపైగా ఉన్నదని రేవంత్‌రెడ్డి సర్కారు వెల్లడించింది. ఇందులో ఐటీ, ఇతర ప్రొఫెషనల్ సేవలు, వాణిజ్యం, హాస్పిటాలిటీ (అతిథ్య) తదితర రంగాలు ప్రముఖ పాత్ర పోషించాయని తెలిపింది. ముఖ్యంగా ఐటీ రంగం గణనీయ వృద్ధి సాధించిందని, 2018-19 ఆర్థిక సంవత్సరంలో 13 బిలియన్ డాలర్లుగా ఉన్న తెలంగాణ ఐటీ ఎగుమతులు 2022-23 నాటికి 29 బిలియన్ డాలర్లకు పెరిగాయని స్పష్టం చేసింది. దేశ ఐటీ ఎగుమతుల్లో 2018 నాటికి 10 శాతంగా ఉన్న తెలంగాణ వాటా నిరుడు 15 శాతానికి చేరినట్టు ప్రకటించింది. దేశంలో స్టార్టప్‌లకు తెలంగాణ ప్రధాన కేంద్రంగా మారుతున్నదని, 2014-23 మధ్య కాలంలో రాష్ట్రంలోని స్టార్టప్‌లు 260 కోట్ల డాలర్ల పెట్టుబడులను సాధించాయని కొనియాడింది. రాష్ట్రంలో ప్రారంభమైన స్టార్టప్‌లలో 2 యూనికార్న్ స్టార్టప్‌లు ఉన్నట్టు పేర్కొన్నది.
ఉత్పత్తి రంగంలోనూ తెలంగాణ మేటిగా నిలిచినట్టు ‘గ్రోత్ స్టోరీ’ నివేదిక స్పష్టం చేసింది. ప్రధానంగా ఫార్మారంగం గణనీయ ప్రగతిని నమోదు చేసినట్టు వెల్లడించింది. కొత్త ఉద్యోగాల కల్పనలో ఈ రంగానిదే అగ్రస్థానమని పేర్కొన్నది. 2021-22లో రాష్ట్రం లో మొత్తంగా కల్పించిన కొత్త ఉద్యోగాల్లో 37 శాతం వాటా ఫార్మా రంగానిదేనని తెలిపింది. దేశ ఔషధ ఎగుమతుల్లో తెలంగాణ వాటా 16 శాతంగా ఉన్నదని ప్రకటించింది. సెమీకండక్లర్ల ఉత్పత్తిలో కర్ణాటక తర్వాత తెలంగాణ రెండో స్థానంలో ఉన్నట్టు వెల్లడించింది. ఏరోస్పేస్ రంగంలోనూ తెలంగాణ పరుగులు తీస్తున్నదని, 2020-21లో ఎఫ్‌డీఐ ఏరోస్పేస్ సిటీస్ ర్యాంకింగ్స్‌లో హైదరాబాద్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచిందని పేర్కొన్నది. టాటా, కల్యాణీ గ్రూపుల్లాంటి దేశీయ దిగ్గజాలతోపాటు లాక్‌హీడ్ మార్టిన్, బోయింగ్ వంటి అంతర్జాతీయ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాయని తెలిపింది. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం కూడా జోరుగా ముందుకు సాగుతున్నట్టు రేవంత్‌రెడ్డి సర్కారు వెల్లడించింది. సీబీఆర్ఈ నివేదిక ప్రకారం ఆఫీస్ స్పేస్ లీజులో కర్ణాటక తర్వాత తెలంగాణ రెండో స్థానంలో నిలిచిందని పేర్కొంది.