కరీంనగర్, జూలై 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ జమ్మికుంట : ఏడు రకాల సన్న వడ్లకే బోనస్ ఇస్తామని ఇటీవల ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం వాటికి కూడా కోత పెట్టేందుకు ప్రయతిస్తున్నదా? జరుగుతున్న పరిమాణాలు చూస్తుంటే ఇలాంటి అనుమానమే కలుగుతున్నది. విక్రయించిన వడ్ల విత్తనాల వివరాలను రైతుల వారీగా నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా డీలర్లను ఆదేశించింది. ఇప్పటికే దాదాపు 90% విత్తనాల అమ్మకాలు పూర్తయిన నేపథ్యంలో వివరాల నమోదు సాధ్యంకాదని డీలర్లు చెప్తున్నారు. ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను వ్యతిరేకిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టేందుకు డీలర్లు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో క్వింటాల్ వడ్లకు రూ.500 బోనస్ ప్రకటించింది. అయితే, అధికారంలోకి వచ్చిన తరువాత, అన్ని రకాల వడ్లకు కాకుండా, కేవలం 37 రకాల సన్నవడ్లకు ఇస్తామని ప్రకటించి, ఆ తరువాత ఆ సంఖ్యను 33కు తగ్గించింది. ఈ సీజన్లో తాజాగా ఏడు రకాలు అంటే తెలంగాణ సోనా, సాంబమసూరి, కూనారం సన్నాలు, హెచ్ఎంటీ సోనా, జై శ్రీరాం, సిద్ది, కేఎన్ఎం రకాలకు మాత్రమే బోనస్ వర్తిస్తుందని ప్రకటించింది. దీనికి కూడా సర్కార్ కట్టుబడి ఉండటం లేదని తాజా ఆదేశాలను బట్టి స్పష్టమవుతున్నది.
వానకాలం సాగు చేసే వరి విత్తనాలను సీడ్స్ డీలర్ల నుంచి మే 15 నుంచి జూన్ మొదటి వారంలో మెజారిటీ రైతులు కొనుగోలు చేస్తారు. ఇప్పుడు సర్కార్ కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. ఈ సీజన్లో ప్రభు త్వం చెప్తున్న ఏడు రకాల సన్నాల సీడ్స్‌ను ఏయే రైతులు.. ఎన్ని బస్తాలు కొనుగోలు చేసి తీసుకెళ్లారో వివరాలు సీడ్స్ డీలర్లే ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశాలు జారీచేసింది. అందుకోసం ‘సీడ్ సేల్స్ మేనేజ్మెంట్ సిస్ట మ్’ పేరిట ఒక పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. అందులో రైతు పేరు, ఆధార్ సంఖ్య లేదా గుర్తింపు వివరాలు, మొబైల్ నంబర్, గ్రామం, మండలం, సర్వే నంబర్/పట్టాదారు వివరాలు, వరి విత్తనం రకం, లాట్ నంబర్ అమ్మిన పరిమాణం (కేజీలు), అమ్మిన తేదీ, బిల్/ఇన్వాయిస్ నంబర్, డీలర్ తదితర వివరాలు, స్టాక్ వివరాలను నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా మండల వ్యవసాయ విస్తరణాధికారులు.. రైతు వేదిక ల్లో సమావేశాలు పెట్టి, పై వివరాలను అప్లోడ్ చేయాలని డీలర్లకు హుకుం జారీ చేస్తున్నారు. ఒకవేళ నిర్ణీత సమయంలో ఈ వివరాలు నమోదు చేయకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా.. సర్కార్ కొత్త పోర్టల్‌ను ప్రారంభించి, అందులో పది పన్నెండు రకాల వివరాలు నింపాలని ఇచ్చిన ఆదేశాలపై డీలర్లు భగ్గుమంటున్నారు. ముంద స్తు ప్రణాళిక, సమాచారం లేకుండా ఇప్పుడు సదరు పోర్టల్‌లో ఎలా వివరాలు నింపుతామ ని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే 90% సీడ్స్ విక్రయాలు పూర్తి అయ్యాయని, ఇప్పుడు సదరు రైతు పేరు, పట్టాదారు పాస్‌పుస్తకం, భూమి సర్వే నంబర్, సాగు విస్తీర్ణం, ఆధార్ నంబర్, గ్రామం పేరు వంటి దాదాపు పది పన్నెండు రకాల వివరాలు అడిగితే.. తాము ఎక్కడి నుంచి తెచ్చి నింపుతామని డీలర్లు వాపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా యాభైవేల మందికిపైగా వరి విత్తనాలు విక్రయించే డీలర్లున్నారు. ప్రభుత్వం ఇచ్చిన వివరాలను ఆన్లైన్లో నమోదు చేసే సాంకేతిక పరిజ్ఞానం చాలామంది కి తెలియదని, అలాంటప్పుడు ఎలా నమోదు చేస్తామని ప్రశ్నిస్తున్నారు. తాము నమోదుచేసిన వివరాల ఆధారంగా బోనస్ ఇస్తామని ప్రభుత్వం చెప్తున్నదని, తద్వారా రైతులతో తాము అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వ స్తుందన్న అభిప్రాయాన్ని డీలర్లు వ్యక్తంచేస్తున్నారు.
ఉదాహరణకు 30 కేజీల బస్తా నారు పోసి నాటు వేస్తే ఎకరానికి మాత్రమే సరిపోతుందని, అదే బస్తాను వెదజల్లి పంట పండిస్తే అది రెండు ఎకరాలకు వస్తుందని చెప్తున్నారు. ప్రభుత్వం అడుగుతున్న వివరాల ప్రకారం చూస్తే.. ఆ రైతు ఎకరంలో సాగు చేశారని చె ప్పాలా? లేక రెండు ఎకరాలకు అని చెప్పా లా? అది తమకు ఎలా తెలుస్తుందని ప్రశ్నిస్తున్నారు. రేపు బోనస్ సరిగా రాకుంటే.. అప్పు డు రైతులు అడిగే ప్రశ్నలకు ఏమని సమాధానం చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. ఈ విధానం వల్ల రైతులకు డీలర్లకు మధ్య అనేక ఇబ్బందులు ఉత్పన్నం అవుతాయన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తున్నారు. దీంతో వివరాల నమోదు విషయంలో తాడోపేడో తేల్చుకొనేందుకు సీడ్స్ అసోసియేషన్ ప్రతినిధులు సిద్ధమవుతున్నారు. ఒకటి రెండు రోజుల్లో కార్యాచరణ ప్రకటించేందుకు రెడీ అవుతున్నారు. ఈ తతంగమంతా బోనస్ ఎగవేతకు సర్కార్ వేస్తున్న కొత్త ఎత్తుగడని వ్యవసాయ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బోనస్‌కు అర్హమైన ఏడు సన్న రకాల విత్తనాల వినియోగాన్ని నిర్ధారించడం, రైతు స్థాయిలో ఏ రకం విత్తనం కొనుగోలు చేశారో ట్రాక్ చేయడం, జిల్లాలవారీగా స్టాక్, డిమాండ్‌ను పర్యవేక్షించడం వంటి వాటి కోసం డీలర్లను వివరాలు అప్లోడ్ చేయాలని అడిగినట్టు సర్కార్ చెప్తున్నా.. వీలైనంత మేరకు బోనస్‌ను కుదించేందుకు కొత్త ఎత్తులు వేస్తున్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికే 90% వరకు విత్తనాలు విక్రయించాం. ఇప్పుడు రైతుల వివరాలు ఎక్కడి నుంచి తెస్తాం. అయినా ఇది సీడ్ డీలర్ల బాధ్యత కాదు. వ్యవసాయ శాఖాధికారులు చూసుకోవాలి. మేము వివరాలు నమోదు చేయడం సాధ్యం కాదు. దీనివల్ల రైతులకు, మాకు మధ్య సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉన్నది. డీలర్లు నమోదు చేసిన వివరాల ఆధారంగా బోనస్ ఇస్తే.. రేపు హెచ్చు తగ్గులు జరిగితే.. రైతులకు సమాధానం ఎవరు చెబుతారు? వివరాల నమోదు నుంచి మమ్మల్ని మినహాయించాలని జిల్లా అధికారులకు చెప్పాం. అయినా చేయాల్సిందేనని పట్టుపడుతున్నారు. అందుకే, రాష్ట్రవ్యాప్త ఆందోళనకు సిద్ధమవుతున్నాం.
