నీరటి మౌనిక చిన్ననాటి నుంచే వ్యాపారం చేయాలని కలలు కంటుండేది. కానీ, ఆర్థిక స్థోమత లేక ఇంటి వద్ద ట్యూషన్లు చెప్పుకోవడానికే పరిమితమైంది. దళితబంధు పథకం ఆమె జీవితాన్ని కొత్త మలుపు తిప్పింది. ఇప్పుడామె వ్యాపారం ప్రారంభించి నెలకు రూ.10,000 సంపాదిస్తున్నది. కంకుర్తి మాధురి కుటుంబానికి ఉన్న చిన్న చెప్పుల దుకాణం రోడ్డు విస్తరణలో పోయింది. ఉపాధి దెబ్బతిన్నది. ఏమిచేయాలో పాలుపోని పరిస్థితి. సరిగ్గా ఇదే సమయంలో దళితబంధు పథకం ఆమెకు కొత్త జీవితాన్ని వాగ్దానం చేసింది. పెద్ద దుకాణం పెట్టుకోవడానికి అవసరమైన ఆర్థికదన్ను లభించింది. ఇప్పుడామె గతం కంటే ఎక్కువగా సంపాదిస్తున్నది. వీరిద్దరికే కాదు ఇలాంటి మరెందరో దళిత మహిళలకు సరైన వ్యాపారాన్ని ఎంచుకోవడంలోనూ, వ్యాపార నిర్వహణలోనూ మార్గదర్శనం చేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వీ-హబ్!
హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న దళితబంధు పథకం కొత్త పుంతలు తొక్కుతున్నది. దళితుల ఆర్థికాభ్యున్నతికి తోడ్పడటమే కాకుండా సామాజిక, ఆర్థిక మార్పులకు బలమైన బాటలు వేస్తున్నది. ఆడబిడ్డల సాధికారతకూ దోహదపడుతున్నది. ఎందరో మహిళలను వ్యాపారవేత్తలుగా, పారిశ్రామివేత్తలుగా తీర్చిదిద్దుతున్నది. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ఏర్పాటు చేసిన ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ హబ్ (వీ-హబ్) తనవంతు పాత్ర పోషిస్తున్నది. ఒక్క హుజూరాబాద్ నియోజకవర్గంలోనే దళితబంధు ద్వారా రూ.10 లక్షల ఆర్థిక సాయం పొందిన దాదాపు 343 మంది మహిళలతో యూనిట్లను ఏర్పాటు చేయించింది. అవి విజయవంతంగా కొనసాగేందుకు నిరంతరం మార్గదర్శనం చేస్తున్నది.
దళితబంధుపై వీ-హబ్ ప్రత్యేక దృష్టి
గత నాలుగున్నరేండ్లలో రాష్ట్రంలో దాదాపు 4 వేల మంది గ్రామీణ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దిన వీ-హబ్ ఆ అనుభవంతో దళితబంధు లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తున్నది. దళితబంధు లబ్ధిదారుల్లో ఔత్సాహిక మహిళలను గుర్తించి వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నది. యూనిట్ల ఏర్పాటుకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు, లైసెన్స్‌లను పొందడంలో సహాయపడటం, యంత్రాల కొనుగోలు కోసం విక్రేతలతో అనుసంధానించడం, కొటేషన్ల ధ్రువీకరణ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆమోదం పొందడం, మార్కెటింగ్ తదితర అంశాల్లో అండగా నిలబడుతున్నది.
హుజూరాబాద్‌లో 342 మందికి తోడ్పాటు
దళితబంధు పథకం అమలు కోసం హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున నియోజకవర్గంలోని మొత్తం 18,021 దళిత కుటుంబాలకు పథకాన్ని వర్తింపజేసింది. వీహబ్ సైతం అదే నియోజవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకున్నది. మూడు నెలల వ్యవధిలోనే స్థానికంగా సపోర్ట్ మెకానిజాన్ని ఏర్పాటు చేసుకొని, యూనిట్ల ఎంపికపై దళిత మహిళలకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించింది. తొలి విడతగా హుజూరాబాద్ స్థానిక పరిపాలనా సంస్థ ఎంపిక చేసిన 790 మంది దళిత మహిళలకు ప్రత్యేకంగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్(ఈడీపీ) సెషన్‌ను నిర్వహించింది. అందుబాటులో ఉన్న లాభదాయక వ్యాపార అవకాశాలపై అవగాహన కల్పించింది. యూనిట్ల ఏర్పాటుపై ఆసక్తి చూపిన 343 మంది మహిళల ఆధ్వర్యంలో కోర్ ప్రాజెక్ట్ నివేదిక(సీపీఆర్)లను రూపొందించి, మరిన్ని సెషన్లు నిర్వహించింది. వీరికి ఎంటర్ప్రైజ్ స్థాపించడం మొదలు మార్కెటింగ్ వరకు మొత్తంగా 7 దశల ప్రక్రియ ద్వారా మార్గనిర్దేశం చేసింది. పరిశ్రమ ఏర్పాటుకు అనువైన ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవడం, అవసరమైన డాక్యుమెంటేషన్, రిజిస్ట్రేషన్, లైసెన్సులు వంటి అన్ని అంశాల్లో అండగా నిలబడింది. వీ-హబ్ సహకారంతో యూనిట్లను ప్రారంభించిన మహిళలు నేడు వాటిని విజయవంతంగా నిర్వహిస్తూ లాభాలను ఆర్జిస్తుండటం విశేషం.
వీ-హబ్ నా ఆలోచనలను మార్చేసింది
మాకు జమ్మికుంట ప్రధాన రహదారిపై చిన్న చెప్పుల షాపు ఉండేది. రోడ్డు విస్తరణ వల్ల అది పోయింది. పెద్ద షాపును అద్దెకు తీసుకొనే స్థోమత లేదు. దీంతో ఆ ఆలోచన చేయలేదు. వీ-హబ్ నిర్వహించిన ఓరియంటేషన్‌కు హాజరయ్యాక నా ఆలోచన మారింది. వ్యాపారం కోసం వాణిజ్య స్థలాన్ని అద్దెకు తీసుకోవాలని నిర్ణయించుకున్నా. తర్వాత వీ-హబ్ సాయంతో షాపు ఏర్పాటుకు అనువైన ప్రాంతాన్ని ఎంపిక చేసుకొన్నా. డాక్యుమెంటేషన్, కస్టమర్లతో మాట్లాడటం, అకౌంటింగ్, బుక్కీపింగ్కు సంబంధించిన మెళకువలు నేర్చుకొన్నా. దుకాణం ఏర్పాటు తర్వాత మా ఆర్థిక స్థితి మెరుగుపడింది. ఆదాయం పెరిగింది. వీ-హబ్ నిరంతర మద్దతు వల్లే ఆత్మవిశ్వాసం పెరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, వీ-హబ్‌కు నా ధన్యవాదాలు.
– కంకుర్తి మాధురి, జమ్మికుంట, దళితబంధు లబ్ధిదారు
వ్యాపారంలో నెలకు 10 వేలు సంపాదిస్తున్నా
మాది హుజూరాబాద్ పట్టణం. సొం తంగా ఏదైనా వ్యాపారం చేయాలని చిన్నతనం నుంచే కలలు కనేదాన్ని. పెండ్లి అయి న తరువాత డిగ్రీ పూర్తి చేశా. కుటుంబం గడవడం కోసం ఇంటోన్లే ట్యూషన్లు చెప్పేదాన్ని. దళితబంధు పథకం మాకు గొప్ప అవకాశం కల్పించింది. నా భర్తకు డ్రైవింగ్ వచ్చు. దీంతో దళితబంధు నిధులతో ట్యాక్సీ కొనాలనుకున్నాం. సరిగ్గ్గా అదే సమయంలో హుజూరాబాద్‌లో వీ-హబ్ నిర్వహించిన ఓరియంటేషన్ సెషన్‌కు హాజరయ్యా. నా ఆలోచనే మారిపోయింది. నా కాళ్లపై నేను నిలబడాలని నిశ్చయించుకున్నా. ట్యాక్సీ ఎప్పుడైనా కొనుగోలు చేయవచ్చని భర్తను ఒప్పించా. వ్యాపారం చేయడం ద్వారా కుటుంబ ఆదాయం పెరుగుతుందని వివరించా. చాలా చర్చల తర్వాత నా భర్త అంగీకరించాడు. వీ-హబ్ చొరవతో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ, స్టేషనరీ దుకాణం ఏర్పాటు చేశా. ట్యూటర్‌గా నెలకు కేవలం రూ.4,000 సంపాదించేదాన్ని. ఇప్పుడు నెలకు రూ.10,000 సంపాదిస్తున్నా. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, వీ-హబ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు.
– నీరటి మౌనిక, హుజూరాబాద్,దళితబంధు లబ్ధిదారు