2014-15లో బియ్యం సబ్సిడీ 690 కోట్లు.. ఈ ఏడాది అది 2,363 కోట్లు! పెన్షన్లకు 2014-15లో వెచ్చించిన మొత్తం 1,834 కోట్లుంటే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చేసిన ఖర్చు.. 11,728 కోట్లు!! కల్యాణలక్ష్మి/ షాదీముబారక్ పథకానికి తొలుత 67 కోట్లు ఇస్తే.. ఈ ఏడాది ఏకంగా 2,750.46 కోట్లు ఇచ్చింది. విద్యుత్తు రాయితీలు.. 2,400 కోట్ల నుంచి 10,530 కోట్లకు పెరిగాయి.
ఇవేకాదు.. సంక్షేమంలో ప్రతి రంగానికి ఏటికేడు వెచ్చిస్తున్న నిధులు గణనీయంగా పెరుగుతున్నాయి. రాష్ట్ర ప్రజల సంక్షేమం పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధకు ఇవి నిదర్శనాలు! సంక్షేమానికి చేస్తున్న ఖర్చులో దేశంలో ఏ రాష్ట్రమూ తెలంగాణకు దరిదాపుల్లో కూడా లేదు.
హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): పేదలు, బలహీనవర్గాల సంక్షేమానికి తెలంగాణ సర్కారు చిరునామాగా మారింది. రాష్ట్ర ఆవిర్భావం నుంచి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఎప్పటికప్పుడు అనేక విప్లవాత్మక పథకాలకు శ్రీకారం చుడుతూ సబ్బండ వర్ణాల సంక్షేమానికి కొత్త బాటలు వేయడమే కాకుండా దేశానికి కొత్తదారి చూపుతున్నారు. సంక్షేమ రంగంలో వినూత్న సంస్కరణలకు నాంది పలికారు. ఉమ్మడి రాష్ట్రంలో పడావుపడ్డ జీవితాలకు కొత్త వెలుగులు నింపే మహాక్రతువును మొదలుపెట్టారు. కనివినీ ఎరుగని పథకాలతో ప్రపంచాన తెలంగాణ సప్తవర్ణ శోభితమై విరాజిల్లుతున్నది. ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, గురుకుల విద్యాలయాలు, ఉచిత విద్యుత్తు, గొర్ల పంపిణీ, చేపల పంపిణీ.. ఇలా చెప్పుకొంటూ పోతే సంక్షేమ పథకాలకు రాష్ట్రం ఓ అధ్యయన కేంద్రంలా భాసిల్లుతున్నది. ఎస్సీల అభివృద్ధి కోసం సంచలనాత్మక దళితబంధు పథకానికి ప్రభుత్వం ఇటీవలే శ్రీకారం చుట్టింది. ఎలాంటి షరతులు లేకుండా రూ.10 లక్షల ఆర్థికసాయాన్ని అందజేస్తూ దళితుల ఆర్థిక అభ్యున్నతికి కొత్త బాటలు వేస్తున్నది. అదేవిధంగా రజకులకు, నాయీ బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్తు, వైన్‌షాపుల్లో ఎస్సీలకు, గౌడ కులస్తులకు రిజర్వేషన్లు తదితర విప్లవాత్మక చర్యలు చేపట్టింది. 41 బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాల స్థలాలను కేటాయించడంతోపాటు, భవన నిర్మాణానికి రూ.కోటి చొప్పున కేటాయించింది. ప్రతి వర్గానికీ ఏదో ఒక లబ్ధి చేకూరేలా పథకాలను రూపొందించి అమలు చేస్తున్నది. తాజాగా రాబోయే బడ్జెట్లోనూ సంక్షేమానికి భారీగా కేటాయింపులు ఉండే అవకాశమున్నది.
ప్రతి పైసాకు ప్రతిఫలం..
రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలపై ఖర్చు చేస్తున్న ప్రతి పైసాకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రతిఫలం దక్కుతున్నది. ఆసరా పెన్షన్లతో వయోవృద్ధులు, దివ్యాంగులకు ఆర్థిక భరోసా దక్కడంతోపాటు, కుటుంబంలో ఆదరణ పెరిగింది. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో బాల్య వివాహాలకు అడ్డుకట్ట పడింది. మాతాశిశు మరణాల రేటు గణనీయంగా తగ్గింది. గొర్ల పంపిణీ పథకం ద్వారా రాష్ట్రంలో మాంసం ఉత్పత్తి గతంతో పోల్చితే 22 శాతం పెరిగింది. చేపల ఉత్పత్తి పెంపులోనూ దూసుకుపోతున్నది. గురుకుల విద్యాలయాల స్థాపన ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల విద్యాభివృద్ధిలో నవశకం మొదలైంది. డ్రాపౌట్స్ తగ్గిపోవడంతో పాటు, ఉన్నత చదువులకు వెళ్లే బాలికల సంఖ్య భారీగా పెరిగింది. మైనారిటీ బాలికల విద్యలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్‌గా నిలువడం గమనార్హం. దళితబంధు పథకం నిరుపేద దళిత కూలీలను ఓనర్లుగా మార్చుతున్నది.
సంక్షేమ పథకాల లబ్ధిదారులు
ఆసరా పెన్షన్లు – 38,80,922
కల్యాణలక్ష్మి /షాదీముబారక్ – 10,56,239
గురుకులాల విద్యార్థులు – 9,47,200
కార్పొరేషన్ల లబ్ధిదారులు – 18,82,832
పౌష్టికాహారం పొందుతున్న మహిళలు – 4,77,922
ఉచిత విద్యుత్తు పొందుతున్న రజకులు/నాయీ బ్రాహ్మణులు – 1,07,352
మొత్తం: 82,45,115
నోట్: ఇది దళితబంధు, డబుల్ బెడ్రూం, రైతుబీమా, రైతుబంధు పథకాలను మినహాయించగా లబ్ధిదారుల సంఖ్య.