హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీల నిధులను మళ్లిస్తున్నదన్న ప్రతిపక్షాల విమర్శలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. కాంగ్రెస్ హయాం లో గ్రామాలకు నిధులు ఒక వ్యక్తికి సగటున రూ.4 ఇస్తే, ఇప్పుడు తమ ప్రభుత్వం రూ.650 ఇస్తున్నదని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో గ్రామ సర్పంచ్ల అధికారాలను తగ్గించి నామమాత్రపు పాలకులుగా మార్చితే, తాము వారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని చెప్పారు. తెలంగాణ సర్పంచ్లమని గర్వంగా తలెత్తుకునేలా చేశామని పేర్కొన్నారు. నేడు తెలంగాణ గ్రామాలను చూసి పొరుగు రాష్ర్టాలు ఆశ్చర్యపోతున్నాయని, మన పల్లెల్లో అభివృద్ధికి జాతీయస్థాయిలో అనేక అవార్డులు వచ్చాయని తెలిపారు. మన పల్లెల్లో వచ్చిన వికాసం దేశంలో ఎక్కడా రాలేదని స్పష్టంచేశారు. శుక్రవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో గ్రామపంచాయతీ నిధుల మళ్లింపుపై కాంగ్రెస్ సభ్యులు అడిగిన ప్రశ్నపై సీఎం కేసీఆర్ జోక్యం చేసుకొని సమాధానమిచ్చారు. తిమ్మిని బమ్మిని చేసి గందరగోళం చేద్దామంటే కుదరదని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని విపక్షాలకు చురకలంటించారు. సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే..
మన పల్లెల అభివృద్ధిని కేంద్ర మంత్రులు, అధికారులు ప్రశంసిస్తున్నారు. మన సర్పంచ్‌లు గర్వపడుతున్నారు. ఎంతో సంతోషంగా ఉన్నారు. ప్రధాని నరేంద్రమోదీ, నీతిఆయోగ్ అధికారులు కూడా పలుసార్లు మన పల్లెల్లో ప్రగతిని ప్రశంసించారు. అనేక అవార్డులు ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లా ముక్రా(కే) గ్రామానికి జాతీయస్థాయిలో అవార్డు లభించింది. ఆ గ్రామ సర్పంచ్ గిరిజన మహిళ అవార్డును అందుకున్నారు. అనేక రాష్ర్టాల నుంచి వచ్చిన పార్లమెంటరీ కమిటీలు, జిల్లా పరిషత్తు అధ్యక్షుల బృందాలు, సర్పంచ్ల బృందాలు, కేంద్ర అధికారుల బృందాలు మన పల్లెలను చూసి తన్మయత్వం చెందాయి. ఇక్కడి అభివృద్ధిని చూసి పులకించి ప్రశంసించాయి. అది ప్రతిపక్షాలకు జీర్ణం అయితలేదు. మీ జమానాలో సర్పంచ్‌లు బాధపడ్డ మాట వాస్తవం. ఇయ్యాల మా జమానాలో గర్వపడుతున్నారు. కొన్ని సందర్భాల్లో విపక్షసభ్యుల మాటలు చూస్తే ఆశ్చర్యమేస్తుంది. జాలి కూడా కలుగుతున్నది. విషయం అవగాహన చేసుకొని మాట్లాడితే మంచిది. అసెంబ్లీలో పట్టణ, పల్లె ప్రగతి, ఉపాధి హామీపై సుదీర్ఘ చర్చకు సిద్ధం. సభలో మాట్లాడనీయకుండా గొంతునొక్కుతున్నారని అంటున్నారు. ఎవరి గొంతు నొక్కుతున్నారు? బ్రహ్మాండంగా, అద్భుతంగా మాట్లాడండి. మీ కంటే మేం అద్భుతంగా మాట్లాడుతం. మనకంటే అద్భుతంగా ప్రజలు గమనిస్తున్నారన్న విషయం గుర్తుపెట్టుకోండి.
కరోనా ఇబ్బంది ఉన్నా గ్రామాల అభివృద్ధికి ఎలాంటి నిధుల కోత విధించలేదు. అవసరమైతే మంత్రులు, ఎమ్మెల్యేల వేతనాల్లో కోత పెట్టి అయినా గ్రామాలకు గ్రాంటు విడుదల చేయాలని ఆర్థికశాఖ, పంచాయతీరాజ్‌శాఖ అధికారులను ఆదేశించాం. అన్ని గ్రామాలకు సమ న్యాయం చేయాలన్న ఉద్దేశంతో పంచాయతీరాజ్ చట్టంలో పొందుపర్చినట్టే మైనింగ్, ఇసుక సీనరేజీ, క్వారీల నుంచి వచ్చే ఆదాయాన్ని నేరుగా ప్రభుత్వం తీసుకొని, అన్ని పంచాయతీలకు సమంగా కేటాయిస్తున్నది. దీంట్లో రహస్యం ఏమీలేదు. పంచాయతీరాజ్ నూతనచట్టంలో ఉన్నదే. సింగరేణి, ఇతర గనులు కొన్ని గ్రామాల్లోనే ఉంటా యి. గనులు లేని గ్రామాలకు రూపాయి కూడా ఆదాయం రాదు. అక్కడ అభివృద్ధి జరగదు. అందుకే గనుల ఆదాయాన్ని ప్రభుత్వం అన్ని గ్రామాలకు సమంగా ఇస్తున్నది. ఆదాయం లేని గ్రామాలకు కాం గ్రెస్ హయాంలో ఆ పుణ్యాత్ములు రూపాయి కూడా ఇచ్చినోళ్లు కాదు. పట్టణ ప్రాంతాలకు సమీపంలోని గ్రామాల్లో భూముల అమ్మకాలు ఉంటాయి. మారుమూల, గిరిజన ప్రాంతాల్లో భూమి అమ్మకాలు దాదా పు ఉండవు. పంచాయతీల్లో ఈ అసమానతలు పోవాలనే ఉద్దేశంతోనే కొత్త పంచాయతీరాజ్చట్టం తీసుకొచ్చినం. ప్రశ్నఅడిగే అధికారం ఉన్నది కాబట్టి తిమ్మిని బమ్మిని చేస్తామంటే కుదరదు. గత ప్రభుత్వాల హయాంలో గ్రామాలు చెత్తమయంగా మారాయి. మంచినీరు, బోర్ల రిపేర్ల కోసం సర్పంచ్‌లు సొంత నిధులను ఖర్చుచేసి దివాలా తీసిన మాట వాస్తవం. విపక్ష సభ్యులు ఇప్పుడు కూడా అలాగే ఉందని అనుకొంటున్నారా? కాంగ్రెస్ హయాంలో రూ.2 వేల కోట్లు కరెంటు బిల్లులు పెండింగ్‌లో పెట్టారు.
కేంద్రం ఇచ్చే నిధులు దారి మళ్లించామా? ఒకటి కాదు రెండు కాదు.. ఉపాధి హామీ నిధులు రూ.15 వేల కోట్లు మళ్లించామని అంటున్నారు. అసలు కేంద్రం నిధులనే మాటే ఉండదు. కేంద్రం ఇవ్వడం ఉండదు. దేశాన్ని నడిపే క్రమంలో రాజ్యాంగం సూచించిన ప్రకారం బాధ్యతలను రెండుమూడు రకాలుగా పంచారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతలు, అధికారాలు, చట్టాలు స్పష్టంగా ఉన్నాయి. ఫైనాన్స్ కమిషన్ ఉంటుంది. అది స్వతంత్ర సంస్థ. ప్రతి ఐదేండ్లకు ఒకసారి పంచవర్ష ప్రణాళిక రూపొందించే ముందు అన్ని రాష్ర్టాలను సంప్రదించి నివేదిక తయారు చేస్తుంది. దాని సిఫారసుల ప్రకారమే కేంద్రం గ్రాంటు ఇస్తున్నది. వాస్తవంగా అది గ్రాంటు కాదు. రాజ్యాంగ ఆబ్లిగేషన్. కేంద్ర దయాదాక్షిణ్యం కాదు. రాష్ర్టాలకు రాజ్యాంగం ప్రకారం రావాల్సిన హక్కు. అధికారంలో ఎవరున్నా రావాల్సిందే. అవి కేంద్రం డబ్బులు కూడా కావు. ఆటోమెటిక్‌గా రాష్ర్టాలకు వస్తయి. కేంద్రం ఇవ్వడం అనేదే ఉత్పన్నం కాదు.
వాస్తవాలు చెబితే కొందరికి జీర్ణం కావు. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ శుద్ధిచేసిన రక్షిత తాగునీటిని అందిస్తున్నాం. పైసా తీసుకోకుండా ఉచితంగా అందిస్తున్నాం. గతంలో సీడీఎఫ్ నిధులు బోర్లకు ఇచ్చేందుకు సరిపోకపోయేవి. గ్రామంలో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలకు కనీసం స్థలం కూడా నాటి పాలకులు చూపించలేకపోయారు. ఇప్పుడు ప్రతి గ్రామంలో నర్సరీ, వైకుంఠధామం ఏర్పాటుచేశాం. వీటన్నింటినీ చూపించడానికి స్పీకర్ ఆధ్వర్యంలో అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయండి. రేపే పోదాం.. సభ్యులు కోరిన గ్రామానికి తీసుకుపోవడానికి సిద్ధం. మేం చేసిన అభివృద్ధిని చూపిస్తాం. పల్లెలు ఇప్పుడు చెత్తా చెదారం లేకుండా, పచ్చని చెట్లతో కళకళలాడుతున్నాయి. ప్రతి ఇంటికీ శుద్ధిచేసిన నీటిని అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేంద్ర మంత్రి లోక్‌సభలో స్వయంగా ప్రకటించారు. మీ (విపక్షాలు) జీవితంలో ఏనాడైనా ఆలోచించారా ఇలాంటిది చూస్తామని?
మేము ఏది చేసినా ధైర్యంగా చేస్తాం. ఏది చెప్తామో అదే చేస్తాం. ఏకగ్రీవ పంచాయతీలకు నిధులు ఇస్తామని ఎక్కడా చెప్పలేదు. అది మా పాలసీలోనే లేదు. పంచాయతీరాజ్ చట్టంలో కూడా పొందుపర్చలేదు. ఉపాధి నిధుల విషయంలో గతం లో కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచ్‌లను నామమాత్రం చేసింది. టీఆర్ఎస్ ప్రభుత్వం వారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచ్‌లకు ప్రత్యామ్నాయ వ్యవస్థను సృష్టించింది. ఉపాధి నిధులు భారీగా దుర్వినియోగమయ్యేవి. ఈ పథకంపై పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్తులు కోల్పోయిన అధికారాన్ని మేం మళ్లీ ఇచ్చాం. ఇప్పుడు గ్రామాల్లో ఇంటి పన్ను 90 నుంచి 100 శాతం వసూలవుతున్నది. అంటువ్యాధులు ప్రబలడం, ఆదిలాబాద్‌లో మనుషులు వ్యాధులతో చనిపోవటం, కలుషిత నీరు తాగి మరణించటం వంటివి ఇప్పుడు కనిపిస్తున్నా యా? వ్యక్తులను కాకుండా వ్యవస్థ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పనిచేస్తున్నాం. దీనిలో భాగంగానే ఫీల్డ్ అసిస్టెంట్లను తీసివేశాం. వారు కూడా కూలీలే. కానీ తమకు తాము ఎక్కువగా ఊహించుకొని సమ్మె చేస్తామని, ప్రతిష్ఠంభన సృష్టిస్తామని ఏవేవో అన్నా రు. ఉపాధి నిధుల్లో రాష్ట్ర మ్యాచింగ్ గ్రాంటు నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్నాం. సర్పంచ్ లు ఇప్పుడు ధైర్యంగా పనిచేసుకొంటున్నారు. 12,769 గ్రామాలకు ఎన్ని నిధులు విడుదల చేశా మో సభకు ఇస్తాం అని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
అవసరమైతే అసెంబ్లీని 20 రోజులు, లేదా నెలరోజులు నిర్వహించటానికి సిద్ధం. మా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను సభ ద్వారానే ప్రజలకు వివరిస్తాం. అసెంబ్లీలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై స్వల్పకాలిక చర్చ కాకుండా దీర్ఘకాలిక చర్చను చేపట్టాలని సభాధ్యక్షుడిని కోరుతున్నా.
ప్రజాస్వామ్య స్ఫూర్తి పరిఢవిల్లాలని.. గిరిజన సోదరులు, ఆదివాసీలు మా తండాలో మా రాజ్యం, మా గూడెంలో మా రాజ్యం పేరుతో ఎన్నో పోరాటాలు చేశారు. తండాలు, గూడేలను గ్రామ పంచాయతీలుగా మారుస్తామని కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో పెట్టింది. ఆ హామీని ఏనాడూ అమలు చేయలేదు. రెండు దశాబ్ద్దాలపాటు హామీలు మాత్రమే ఇచ్చింది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక మూడు వేలకు పైగా తండాలు, గూడేలను గ్రామ పంచాయతీలుగా మార్చాం.