హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): దివ్యాంగుల రక్షణకు, సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా ఉంటున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. డిసెంబర్ 3 అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని పలువురు దివ్యాంగుల నాయకులతో కవిత బుధవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పలు అంశాలపై చర్చించి పరిషారాలకు హామీ ఇచ్చారు. మహిళా దివ్యాంగులకు వుమెన్ హబ్ ద్వారా ఉపాధి కల్పించేందుకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. దివ్యాంగుల శాఖ స్వతంత్రత అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని భరోసా ఇచ్చారు.
దళితబంధు, డబుల్ బెడ్ రూం, అన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర సంక్షేమ పథకాల్లో 5 శాతం దివ్యాంగులకు కేటాయించాలని నిజామాబాద్ జిల్లా కలెక్టరుకు సూచించారు. తప్పుడు వికలాంగుల ధ్రువీకరణ పత్రాలతో ఉద్యోగాలు పొందడం అంశంపై టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్‌తో చర్చించారు. దివ్యాంగ ఉద్యోగ అంశాలపై సంఘం ప్రతినిధులతో మాట్లాడుతూ అన్ని ముఖ్యమైన పెండింగ్ ప్రతిపాదనలు అమలుచేసే అంశాన్ని సీఎస్‌తో మాట్లాడతానని హామీనిచ్చారు. సమావేశంలో తెలంగాణ జాగృతి నాయకుడు నవీన్ ఆచారి, టీఎస్ఫుడ్స్ చైర్మన్ రాజీవ్‌సాగర్, జాగృతి కార్యదర్శి నల్లగొండ శ్రీను, వివిధ సంఘాల ప్రతినిధులు నారా నాగేశ్వరరావు, హబీబ్ మియా, కోలా సైదులు, రాజ్యలక్ష్మి, మణి, పార్వతి, మల్లికార్జున్, రాజేందర్, సుధాకర్ వర్మ, మున్నా, అమ్ములు, నాగరాజు, అంజయ్య, నాగరాజు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
నేడు కానిస్టేబుల్ కిష్టయ్య సంస్మరణ దినం
తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో కానిస్టేబుల్ కిష్టయ్య 13వ సంస్మరణ సభను గురువారం నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన వాల్ పోస్టర్ టీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు బుధవారం ఆవిష్కరించారు. హైదరాబాద్ గన్‌పార్క్ వద్ద సంస్మరణ సభ జరుగనుండగా, తెలంగాణ అంతటా అమరవీరుల స్తూపాల వద్ద నిర్వహించాలని ముదిరాజ్ మహాసభ నాయకులు కోరారు. మంత్రి వెంట ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ ముదిరాజ్, పిట్టల రవీందర్ ముదిరాజ్ ఉన్నారు.