ఖైరతాబాద్, డిసెంబర్ 17: వైద్యరంగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోని ఇతర రాష్ర్టాలకు రోల్ మాడల్‌గా నిలిచిందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. తెలంగాణ వైద్య విధానాలను ఇతర రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకొంటున్నాయని చెప్పారు. దేశంలో సింగిల్ యూజ్ డయాలసిస్ పద్ధతిని మొట్టమొదట ప్రారంభించింది తెలంగాణ రాష్ట్రమేనని వెల్లడించారు. తెలంగాణ డయాలసిస్ సిస్టమ్‌ను తమిళనాడు కూడా అమలుచేస్తున్నట్టు ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ ఇటీవలే ప్రకటించారని గుర్తుచేశారు. నిమ్స్ దవాఖానలోని ట్రామా బ్లాక్‌లో రూ.2 కోట్లతో కొత్తగా ఏర్పాటుచేసిన ఇంట్రా ఆపరేటివ్ అల్ట్రాసౌండ్, ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్, అల్ట్రాసోనిక్ ఆస్పిరేట్ పరికరాలను మంత్రి హరీశ్‌రావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకొనేలా వ్యాస్కులర్ సర్జరీ సింపోజియం నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు.
నిమ్స్ నెఫ్రాలజిస్టులకు తన అనుభవాలు, నైపుణ్యాలు నేర్పుతున్న డాక్టర్ దామోదర్‌రెడ్డి, సందీప్ మహాపాత్ర కృషి అభినందనీయమని పేర్కొన్నారు. ‘ఈ మధ్య ఒక వైద్యుడు అమెరికాలో చిన్నపిల్లలకు గుండె శస్త్ర చికిత్సలు చాలా చేస్తున్నాం.. సంవత్సరంలో ఒక నెల తెలంగాణకు వచ్చి చేస్తాం.. రోగులను గుర్తిస్తే ఆపరేషన్లు చేసి ఇక్కడి డిపార్ట్మెంట్ను బలోపేతం చేసి వెళ్తామని చెప్పారు. ఇటీవలే ఎంఎన్‌జేకు చెందిన డాక్టర్ శరత్ కూడా తాను అమెరికా నుంచి వచ్చి తెలంగాణలో సేవలు అందిస్తా అని చెప్పారు. ఇలా ఎంతోమంది అవకాశం ఇస్తే అక్కడకు వచ్చి సేవ చేస్తామంటున్నారు. వారి సేవలను మనం ఉపయోగించుకొంటే ప్రజలకు ఎంతో మేలు చేసినవారమవుతాం’ అని తెలిపారు.
డయాలసిస్ సేవల్లో తెలంగాణే చాంపియన్
డయాలసిస్ రోగులకు సేవలందించడంలో తెలంగాణ రాష్ట్రమే చాంపియన్‌గా ఉన్నదని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఈ విషయంలో అందరూ సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపాలని అన్నారు. కార్పొరేట్ దవాఖానల్లో మాత్రమే కనిపించే సింగిల్ యూజ్ డయాలసిస్ సిస్టమ్‌ను ప్రభుత్వ దవాఖానల్లో ఏర్పాటుచేసిన ఘతన సీఎందేనని పేర్కొన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో ఆరోగ్యశ్రీ కింద రూపాయి ఖర్చులేకుండా సింగల్ యూజ్ డయాలసిస్ సేవలు అందిస్తున్నామని చెప్పారు. నేడు ఇతర రాష్ర్టాలు కూడా ఈ పద్ధతిని అమలు చేస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు ఉస్మానియా, గాంధీ, వరంగల్ ఎంజిఎంలో మాత్రమే డయాలసిస్ కేంద్రాలు ఉండేవని, నేడు 102 కేంద్రాల్లో ఈ సేవలను అందిస్తున్నట్టు తెలిపారు. ఉచిత డయాలసిస్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు వెల్లడించారు. చికిత్స కోసం డయాలసిస్ కేంద్రాలకు వచ్చి వెళ్లడానికి రోగులకు బస్‌పాస్ ఇస్తున్నామని తెలిపారు. ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకొన్నవారికి జీవిత కాలం మందులు ఉచితంగా ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. డయాలసిస్ రోగులకు పెన్షన్లు కూడా ఇస్తున్నామని గుర్తుచేశారు.
గతవారం 50 లక్షల డయాలసిస్ సైకిల్స్ పూర్తిచేసుకొన్నట్టు తెలిపారు. రాష్ట్రంలో 10 లక్షల మంది రోగులు ఉచితంగా డయాలసిస్ సేవలు పొందుతున్నట్టు వివరించారు. అసలు వ్యాధులే రాకుండా చర్యలు తీసుకోవటంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టిందని, దేశంలోనే తొలిసారి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నట్టు తెలిపారు. ప్రజల్లో బీపీ, షుగర్ వ్యాధులు పెరిగిపోతుండటంతో కిడ్నీ, గుండె వంటి ప్రధాన అవయవాలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయని అన్నారు. ఈ సమస్యలను ముందుగానే గుర్తించేందుకు ఎన్సీడీ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ స్క్రీనింగ్‌లో రోగులను గుర్తించడమే కాకుండా, వారికి నెలకు సరిపోయే మందులను ఒక బ్యాగ్‌లో పెట్టి ఆశా వర్కర్లు రోగి ఇంటికి వెళ్లి ఇస్తున్నారని పేర్కొన్నారు.
ఏటా ఆరోగ్యశ్రీ కింద రూ.వెయ్యికోట్లు
ఒకప్పుడు సంపన్నులకే పరిమితమైన కిడ్నీ, హార్ట్, లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ వంటివి నేడు తెలంగాణలో పేదలకు కూడా పైసా ఖర్చులేకుండా అందుతున్నాయని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఇందుకోసం ఆరోగ్యశ్రీ కింద ఏటా రూ.వెయ్యి కోట్లు ఖర్చుపెడుతున్నామని చెప్పారు. నిమ్స్‌లో లంగ్, లివర్, హార్ట్, కిడ్నీ తదితర ట్రాన్స్‌ప్లాంట్స్ జరుగుతున్నాయని వెల్లడించారు. న్యూరో విభాగంలో కైడా మంచి సేవలు అందిస్తున్నారని, అయితే బ్రెయిన్‌డెత్ డిక్లరేషన్లు ఇంకా పెరగాలని సూచించారు. ఆర్గాన్ రిట్రైవల్స్, అవైలబిలిటీ పెరగాలని, అవయవ మార్పిడి కోసం ఉన్న వెయిటింగ్ లిస్ట్‌ను తగ్గించాలని కోరారు. నిమ్స్‌లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ తదితర పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చామని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప, నెఫ్రాలజీ విభాగాధిపతి డాక్టర్ గంగాధర్, వాస్కులర్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ అమరేశ్, జీవన్‌దాన్ తెలంగాణ ఇన్చార్జి డాక్టర్ స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.