హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని రైతులు కొత్తపంటలు సాగు చేయాలనే లక్ష్యంతో ములుగు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఫ్రూట్స్(సీవోఈ) పరిశోధనలు చేస్తున్నది. అందులో భాగంగా అత్యంత పోషకాలు, ఔషధాలు ఉండే అవకాడో సాగును ఎంచుకున్నది. అమెరికా, మెక్సికోలో విస్తారంగా సాగుచేసే అవకాడోలో అనువైన రకాలను ఎంపికచేసి పరిశోధనలు మొదలుపెట్టింది.
తెలంగాణకు అనుకూలమైన ఆరసుప్రీం, కూర్గ్వ్రి అనే రకాలను ఎంచుకున్నది. ఇటీవల రాష్ట్ర ఉద్యానశాఖ డైరెక్టర్ యాస్మిన్‌బాషా, జాయింట్ డైరెక్టర్ సునీత, అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీధర్ స్వయంగా ఎకరా విస్తీర్ణంలో 208 మొకలు నాటారు.
పర్యావరణ మార్పులు తట్టుకునేలా విత్తనోత్పత్తి : ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ రాజిరెడ్డి
హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ) : పర్యావరణ మార్పులు తట్టుకొని చీడపీడలను ఎదురొనే కూరగాయల విత్తనాలను త్వరలోనే రైతులకు అందించేందుకు కృషి చేస్తామని ఉద్యాన వర్సిటీ వీసీ డాక్టర్ దండ రాజిరెడ్డి తెలిపారు. ప్రభుత్వ సహకారంతో ఉద్యాన రైతులకు నాణ్యమైన విత్తనాన్ని అందించి తద్వారా అధిక దిగుబడులు, లాభాలు ఆర్జించేందుకు విశ్వవిద్యాలయం సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నట్టు చెప్పారు.
హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ ఉద్యాన విశ్వవిద్యాలయం కళాశాలలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కూరగాయ పంటల్లో సూటి(నాటు), హైబ్రిడ్ రకాల నాణ్యమైన విత్తనం ఖర్చుతో కూడుకున్నదని, అందుకే నాణ్యమైన ఉత్పత్తి లక్ష్యంగా విత్తన, ప్రభుత్వ సంస్థలు ముందుకుసాగాలని ఆయన కోరారు.