కార్మికుల కోసం ఆలోచించే జాతిపిత కేసీఆర్
వలస కార్మికుల్ని ఆదుకొన్న ఘనత మనదే
రాష్ట్రంలో పరిశ్రమలకు నిరంతర విద్యుత్తు
కార్మికులకు ఇక్కడ కావాల్సినంత ఉపాధి
గూగుల్, అమెజాన్ వంటి దిగ్గజాలకు కేంద్రం
మే డే వేడుకలలో మంత్రులు మల్లారెడ్డి, తలసాని, మహమూద్ అలీ వ్యాఖ్యలు
రవీంద్రభారతి, మే 1: కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం ఆలోచించే జాతిపిత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మే డే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఆదివారం రవీంద్రభారతిలో ప్రపంచ కార్మికుల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు మల్లారెడ్డి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. కరోనా సమయంలో దేశంలోని వివిధ రాష్ర్టాలకు చెందిన వలస కార్మికులకు డబ్బులిచ్చి, వారిని స్వస్థలాలకు పంపిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని వెల్లడించారు. కార్మికులను ధనవంతులను చేయటమే సీఎం కేసీఆర్ లక్ష్యమని చెప్పారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ విదేశాలకు వెళ్లి అనేక పరిశ్రమలను తీసుకొస్తున్నారని అన్నారు. గూగుల్, అమెజాన్ వంటి దిగ్గజ కంపెనీలు తమ బ్రాంచీలను హైదరాబాద్‌లో నెలకొల్పాయని, ఈ ఘనత సీఎం కేసీఆర్‌దేనని వ్యాఖ్యానించారు. దేశమంతా విద్యుత్తు కోతలున్నా, రాష్ట్రంలోని చిన్న, పెద్ద తరహా పరిశ్రమలకు నిరంతరం విద్యుత్తు సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తేల్చి చెప్పారు.
రాష్ట్రంలో సంతోషంగా కార్మికులు
టీఆర్ఎస్ సర్కారు హయాంలో కార్మికులు సంతోషంగా ఉంటున్నారని, వారికి వైద్య బీమా, జీవిత బీమా వంటి పథకాలు వర్తింపజేస్తున్నామని, కార్పొరేట్ దవాఖానల్లో చికిత్సలు అందిస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో కార్మిక సంఘాల సమ్మెలు, గొడవలు లేనేలేవని వెల్లడించారు. దేశంలోని అన్ని రాష్ర్టాల నుంచి హైదరాబాద్‌కు ఉపాధి కోసం వస్తున్నారని, ఇక్కడ కార్మికులు, యువతకు కావల్సినంత పని దొరుకుతున్నదని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో జరుగని అభివృద్ధి తెలంగాణలో జరుగుతున్నదని, దేశానికే తెలంగాణ దిక్సూచి అని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు తీసుకొచ్చారని, పేద దళిత కుటుంబాలను ధనవంతులను చేయటమే లక్ష్యంగా దళిత బంధును అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.
బంగారు తెలంగాణే లక్ష్యం
మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కార్మికులు సంతోషంగా జీవిస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్.. బంగారు తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తూ, కార్మికుల సంక్షేమానికి పాటుపడుతున్నారని కొనియాడారు. కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వెల్లడించారు. అనంతరం అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వివిధ రంగాల్లోని 44 మంది కార్మికులకు శ్రమశక్తి అవార్డులు, 12 సంస్థలకు బెస్ట్ మేనేజ్మెంట్ అవార్డులను మంత్రి మల్లారెడ్డి ప్రదానం చేశారు. కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కార్మిక శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
శ్రమజీవుల కష్టానికి గుర్తింపు మే డే
కార్మిక సోదరులకు కేటీఆర్ శుభాకాంక్షలు
రాష్ట్రంలోని కార్మిక, కర్షక సోదరులకు మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు మే డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ‘శ్రమజీవుల కష్టానికి గుర్తింపు.. కార్మిక పోరాటానికి మేలిమలుపు.. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక, కర్షక సోదరులందరికీ మే డే శుభాకాంక్షలు’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు.