Junior Colleges | హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): మిక్స్డ్ ఆక్యుపెన్సీ కాలేజీలకు ఈ ఏడాది అనుమతులొచ్చేనా..? ఈ కాలేజీల్లోని విద్యార్థుల పరీక్షలకు అనుమతిస్తారా..? అంటే సందేహంగానే కనిపిస్తున్నది. రాష్ట్రంలోని 235 ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఇంకా అనుమతులు పొందలేదు. దీంతో విద్యార్థుల భవితవ్యం అగమ్యగోచరంగా తయారైంది. ఈ కాలేజీలకు మినహాయింపుపై సర్కారు మీనమేషాలు లెక్కిస్తున్నది.
పైగా ఇదే కాలేజీల్లో సెకండియర్ విద్యార్థులకు ఎగ్జామ్ ఫీజు చెల్లించే అవకాశం ఇచ్చారు. కానీ ఫస్టియర్ విద్యార్థుల విషయంపై ఇంకా ఏం తేల్చలేదు. మరోవైపు ఇంటర్ వార్షిక పరీక్షలు సమీపిస్తున్నాయి. ఆలస్య రుసుముతో ఫీజు చెల్లింపు గడువు 27తో ముగియనుంది. ఈ గడువు ముగిస్తే ఫీజు చెల్లించే దారులన్నీ మూసుకుపోతాయి. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉండగా, సర్కారు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నది. కాలేజీల యాజమాన్యాలు సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి.