Telugu | హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ) : సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ బోర్డుల పాఠశాలల్లో తెలుగు తప్పనిసరి చట్టం అమలుపై కాంగ్రెస్ సర్కారు అబద్ధాలు ప్రచారం చేస్తున్నది. గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి అమలుచేయలేదని కేసీఆర్ ప్రభుత్వంపై అభాండాలేస్తున్నది. వాస్తవానికి రాష్ట్రం లో తెలుగు తప్పసరిగా బోధించాలన్న చట్టాన్ని రూపొందించిందే కేసీఆర్ సర్కారు.
తెలుగుభాష పరిరక్షణకుగానూ పాఠశాలల్లో తెలుగును ఓ సబ్జెక్టుగా బోధించేలా 2018 మార్చి 30న యాక్ట్ -10 పేరుతో అప్పటి ప్రభుత్వం చట్టాన్ని రూపొందించింది. దీనిని అమలుచేయాలని సూచిస్తూ 2018 ఏప్రిల్ 2న ప్రభుత్వం జీవో-15 జారీచేసింది. 2018-19 విద్యాసంవత్సరం నుంచి దశల వారీగా తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా అమలుచేశారు.
1,2,3,4,6,7,8,9 తరగతుల్లో తెలుగును బోధనాంశంగా అమలైంది కూడా ఈ ప్రణాళిక ప్రకారమే. 2022-23విద్యాసంవత్సరంలో 5, 10 తరగతుల్లో తెలుగును తప్పనిసరిచేసింది. వార్షిక పరీక్షలను నిర్వహించాలని సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ బోర్డు చైర్మన్లకు లేఖలు సైతం రాసింది. కరోనా నేపథ్యంలో స్కూళ్లు ఈ విషయంపై అంతగా దృష్టిసారించలేదు. ఇప్పుడు కొత్తగా 9, 10 తరగతుల్లో తెలుగును తప్పనిసరి చేస్తూ విద్యాశాఖ ఫిబ్రవరి 25న మెమో జారీచేసింది. 2026-27 విద్యాసంవత్సరంలో బోధించాలని ఆదేశాలివ్వడం గమనార్హం.