హైదరాబాద్, నవంబర్ 2(నమస్తే తెలంగాణ): గోదావరి జలాల వాటాలు, నీటి లభ్యతపై ఏపీ ప్రభుత్వం లేవనెత్తుతున్న అంశాలన్నీ అసమంజసమని తెలంగాణ సర్కారు కొట్టిపారేసింది. గోదావరి జలాల పంపిణీకి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకోవద్దని తేల్చిచెప్పింది. ఈ మేరకు కేంద్ర జల్‌శక్తి శాఖకు తెలంగాణ రాష్ట్ర సాగు నీటిపారుదల శాఖ సెక్రటరీ ఇటీవల లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం గోదావరిపై చేపట్టిన ప్రాజెక్టులతో పోలవరం, ఇతర ప్రాజెక్టుల నీటి లభ్యతపై తీవ్ర ప్రభావం చూపుతుందని, అంతర్రాష్ట్ర జలవివాదాల చట్టం 1956 సెక్షన్ 3 ప్రకారం ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని కోరుతూ గతంలోనే కేంద్ర జల్‌శక్తి శాఖకు ఏపీ సర్కారు విజ్ఞప్తి చేసింది. ఏపీ చేసిన ప్రతిపాదలను తాజాగా తెలంగాణ సర్కారు ఆక్షేపించింది.