Text Books | హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): తెలుగు పాఠ్యపుస్తకాల ముందుమాటలో మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సహా పలువురు మాజీ మంత్రుల పేర్లను తొలగించే విషయంలో విద్యాశాఖ పూటకో రీతిన ఆదేశాలివ్వడం గందరగోళానికి దారితీసింది. పాఠ్యపుస్తకాల్లో కేసీఆర్, మాజీ మంత్రుల పేర్లు ఉన్న విషయం తెలియగానే తొలుత ఆ పేజీని చింపివేయాలని మౌఖిక ఆదేశాలిచ్చారు. దీంతో పలు జిల్లాల్లో ఆయా పేజీలను చింపివేశారు. ఆ తర్వాత గురువారం డీఈవోలకు ఇచ్చిన ఆదేశాల్లో 1-10 తరగతుల తెలుగుభాషా పుస్తకాలను ఎమ్మార్సీలకు, జిల్లా గోడౌన్లకు రిటర్న్చేయాలని పేర్కొన్నారు. మళ్లీ ఏమైందో ఏమో కానీ శుక్రవారం తాజా ఆదేశాలు జారీ చేశారు. కేసీఆర్‌తోపాటు మాజీ మంత్రుల పేర్లు ఉన్న పేజీని కత్తిరించి కవర్ పేజీ వెనుక వైపు గమ్‌తో లేదా ఫెవికాల్తో అతికించాలని సూచించారు.
కొన్ని స్కూళ్లలో తొలుత చింపిపారేసిన పేజీలు దొరక్కపోవడంతో టీచర్లు ఆ పేజీని జిరాక్స్ తీయించి అతికించాల్సి వచ్చింది. ముందు ఆ పేజీని చింపివేయాలని, ఆ తర్వాత పుస్తకాలను వెనక్కి ఇవ్వాలని, మళ్లీ అతికించాలని ఆదేశాలివ్వడం హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్రంలోని 1-10 తరగతుల్లోని విద్యార్థులకు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పాఠ్యపుస్తకాలను పంపిణీ చేసింది. అయితే, తెలుగు పుస్తకం ముందుమాటలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కడియం శ్రీహరి, జగదీశ్‌రెడ్డి, సబితాఇంద్రారెడ్డి పేర్లు ఉన్నాయన్న కారణంతో దాదాపు 25 లక్షల పుస్తకాలను వెనక్కి తెప్పించారు. ఆయా పుస్తకాలను ఎమ్మార్సీలకు, జిల్లా గోడౌన్లకు చేర్చారు. ఈ చర్యను మాజీ విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తీవ్రంగా ఆక్షేపించారు. ఇది భావ్యంకాదని, తమిళనాడు, ఏపీ రాష్ర్టాల్లో ముఖ్యమంత్రులు వ్యవహరించినట్టు హుందాగా వ్యవహరించాలని సూచించారు.
‘ఈ సంవత్సరం అన్ని తెలుగు పాఠ్యపుస్తకాలపై పొరపాటున మాజీ మంత్రులు, అధికారుల పేర్లు ముద్రితమయ్యాయి. ఈ పేజీ వెనుకభాగంలో జాతీయగీతం, జాతీయగేయం, ప్రతిజ్ఞ ఉన్నాయి. ఈ పేజీని బ్లేడ్ లేదా కత్తెరతో జాగ్రత్తగా కట్‌చేయాలి. ఆ పేజీని అదే పుస్తకం కవర్‌పేజీ వెనుకభాగంలో అతికించాలి. ఈ విధంగా చేసేటప్పుడు మాజీ మంత్రులు, అధికారుల పేర్లున్న పేజీ కనపడకుండా ఉండేలా, జాతీయగీతం, జాతీయగేయం, ప్రతిజ్ఞ కనిపించేలా జాగ్రత్తపడాలి’ అని అధికారులకు సూచించారు. మొత్తం ఈ ప్రక్రియను స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలో పూర్తిచేయాలని పలు జిల్లాల డీఈవోలు ఆదేశాలిచ్చారు. తమ కాంప్లెక్స్ పరిధిలోని పుస్తకాలను ఆయా హెచ్ఎంలు తమ వద్దకు తెప్పించుకుని పేజీని చింపి, అతికించి తిరిగి సంబంధిత స్కూళ్ల ప్రధానోపాధ్యాయులకు ఇవ్వాలని సూచించారు. శుక్రవారంలోగా ఈ ప్రక్రియను పూర్తిచేయాలని, పూర్తయిన తర్వాత తమ కాంప్లెక్స్ పరిధిలో అతికించడం పూర్తయ్యిందని డిక్లరేషన్ ఇవ్వాలని ఆదేశాలిచ్చారు..
పాఠ్యపుస్తకాల వ్యవహారంలో ఇద్దరు అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి, ప్రభుత్వ పాఠ్యపుస్తక ముద్రణ సంస్థ డైరెక్టర్ ఎస్ శ్రీనివాసచారిని బదిలీచేస్తూ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. రాధారెడ్డిని ఎస్సీఈఆర్టీ నుంచి తప్పించి సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా బదిలీచేశారు. ఇక్కడున్న గాజర్ల రమేశ్‌ను ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌గా నియమించారు. ప్రభుత్వ పాఠ్యపుస్తక ముద్రణ సంస్థ డైరెక్టర్ ఎస్ శ్రీనివాసచారికి మాడల్ స్కూల్ డైరెక్టర్‌గా పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించగా, ఆయన స్థానంలో తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (టీఆర్ఈఐ) కార్యదర్శి సీహెచ్ రమణకుమార్‌కు పాఠ్యపుస్తక ముద్రణ సంస్థ డైరెక్టర్‌గా బాధ్యత అప్పగించారు. అయితే ఉత్తర్వులో పలు తప్పులుండటం గమనార్హం. సమగ్రశిక్షకు అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్ పోస్టు ఉండగా, ఈ పోస్టు పేరును అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పేర్కొన్నారు.