శుక్రవారం 30 అక్టోబర్ 2020
Telangana - Oct 08, 2020 , 03:02:21

వివాహానికి 100 మంది

వివాహానికి 100 మంది

  • వారం తర్వాత స్విమ్మింగ్‌పూళ్లకు అనుమతి
  • రాష్ట్ర ప్రభుత్వ అన్‌లాక్‌-5 మార్గదర్శకాలు 
  • థియేటర్లు తెరువడంపై త్వరలో ప్రకటన

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: క్రీడాకారులకు శిక్షణ ఇచ్చే స్విమ్మింగ్‌పూళ్లను ఈ నెల 15 తర్వాత తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. బిజినెస్‌ టు బిజినెస్‌ ఎగ్జిబిషన్లు ఈ నెల 15 తర్వాత నిర్వహించుకోవచ్చని పేర్కొన్నది. బుధవారం ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అన్‌లాక్‌-5 మార్గదర్శకాలను విడుదల చేసింది. రాష్ట్రంలో మరికొన్ని రోజులు ఆన్‌లైన్‌ చదువులే కొనసాగనున్నాయి. పీజీ, పీహెచ్‌డీ, ప్రొఫెషనల్‌ కోర్సుల విద్యార్థులను మాత్రం ఈ నెల 15వ తేదీ తర్వాత ల్యాబుల్లో ప్రయోగాలు చేసుకునేందుకు అనుమతిస్తారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆన్‌లైన్‌ క్లాసులు, దూర్యవిద్యను ప్రోత్సహిస్తామని పేర్కొన్నది. విద్యాసంస్థలు, కోచింగ్‌ సెంటర్లు, సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు, వినోద పార్కులు వంటివి తెరిచే తేదీలపై త్వరలో ప్రత్యేక ప్రకటన విడుదల చేస్తామని తెలిపింది.  సామాజిక, సాంఘిక, సాంస్కృతిక, మతపరమైన, రాజకీయ సమావేశాల్లో గరిష్ఠంగా 100 మంది పాల్గొనే అవకాశం కల్పించింది. పెండ్లిళ్లు, అంత్యక్రియలకు కూడా 100 మందిని మాత్రమే అనుమతించింది. ఆయా సమావేశాల్లో కొవిడ్‌-19 నిబంధనలు తప్పక పాటించాలని ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది. 65 ఏండ్లకుపైబడినవారు, పదేండ్లలోపు పిల్లలు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు వీలైనంతవరకు ఇండ్లలోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లొద్దని సూచించింది. కంటైన్మెంట్‌ జోన్లలో ఈ నెల 31వరకు లాక్‌డౌన్‌ కొనసాగుతుంది. కంటైన్మెంట్‌, బఫర్‌ జోన్లను జిల్లా అధికారులు గుర్తించి, నిబంధనలను అమలు చేయాల్సి ఉంటుంది.