హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆలయాలను పట్టించుకోవడమే మర్చిందని పలువురు ఎమ్మెల్యేలు వాపోయారు. క్వశ్చన్ అవర్‌లో పలు ఆలయాల అభివృద్ధి, టూరిజం శాఖ చేపట్టాల్సిన పనులను ప్రశ్నలరూపంలో సభకు విన్నవించారు. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు మాట్లాడుతూ అలంపూర్ జోగులంబ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని, రోడ్లు అధ్వానంగా ఉన్నాయని తెలిపారు.
రామగుండంలోని గుడులను టూరిజం స్పాట్లుగా చేయాలని ఎమ్మెల్యే మక్కన్‌సింగ్ డిమాండ్ చేశారు. గోదావరిఖనికి హరిత హోటల్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొత్తగూడెంలోని ఆలయాలను పట్టించుకోవాలని కూనంనేని సాంబశివరావు కోరారు. వేములవాడ గుడి పరిసరాల్లో కూడా బోట్ సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కోరారు. బాసరలో టెంపుల్ టూరిజం మెగురుపర్చాలని విఠల్‌రెడ్డి కోరారు.
తమ నియోజకవర్గాల పరిధిలో ఆలయాలను పట్టించుకోవాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, రాంచందర్‌నాయక్ కోరారు. వీరి ప్రశ్నలకు మంత్రి జూపల్లి కృష్ణారావు సమాధానం ఇస్తూ.. టూరిజం ద్వారా రూ.15,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షిస్తున్నామని తెలిపారు. టూరిజం పాలసీ తీసుకొచ్చామని, అన్ని ప్రాంతాల ఆలయాలు, పర్యాటక ప్రాంతాలకు మేలు చేస్తామని తెలిపారు. ముఖ్యంగా జోగులాంబ ఆలయాన్ని తప్పకుండా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.