Salaries | హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): కొత్త ఏడాది నుంచి ఉద్యోగుల తరహాలో పంచాయతీ కార్మికులకు నేరుగా వేతనాలు చెల్లిస్తామని చెప్పిన సర్కారు మాటతప్పింది. గడువు ముగిసి నాలుగురోజులైనా ఖాతాల్లో నగదు జమచేయడంలో విఫలమైంది. ఆరు నెలల పెండింగ్ వేతనాలు ఒకేసారి వస్తాయని సంబురపడ్డ కార్మికుల్లో నైరాశ్యం అలుముకున్నది. ఇదే విషయమై పంచాయతీరాజ్‌శాఖ అధికారులను అడిగితే తమకేమీ తెలియదంటూ దాటవేస్తున్నారని పంచాయతీ ఉద్యోగ, కార్మిక సంఘాల నాయకులు చెబుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 52 వేల మంది పంచాయతీ కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి నెలకు రూ.9,500 చొప్పున వేతనాలు ఇస్తున్నది. జీతాలు నేరుగా ఇవ్వకపోవడంతో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని భావించి నేరుగా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీ కార్యదర్శుల ద్వారా సిబ్బంది బ్యాంక్ ఖాతాలు, ఆధార్‌కార్డులు సేకరించింది. కొత్త సంవత్సరం నుంచి నేరుగా కార్మికుల ఖాతాల్లో వేతనాలు జమచేస్తామని ప్రకటించింది. కానీ, గడువు ముగిసినా ఖాతాల్లో నగదు జమచేయలేదని కార్మిక సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పంచాయతీల్లో పనిచేస్తున్న కారోబార్లు, బిల్ కలెక్టర్లు, పంపు ఆపరేటర్లు, ట్రాక్టర్ల డ్రైవర్లు, పారిశుధ్య సిబ్బందికి ఆరు నెలలుగా వేతనాలు అందడం లేదు. గతేడాది వరకు ప్రభుత్వం ప్రతినెలా పల్లెప్రగతి నిధులు ఇచ్చేది. ఆర్థిక సంఘం నుంచీ క్రమం తప్పకుండా నిధులు మంజూరయ్యేవి. దీంతో సిబ్బంది వేతనాలకు ఇబ్బంది ఉండేది కాదు. అయితే ఫిబ్రవరి 1న పంచాయతీ పాలకవర్గాల గడువు ముగియడంతో ప్రత్యేకాధికారుల పాలన ప్రారంభమై కార్మికులకు కష్టాలు మొదలయ్యాయి.
ప్రభుత్వం కార్మికులను చిన్నచూపు చూస్తున్నది. కొత్తేడాది నుంచి క్రమం తప్పకుండా ఖాతాల్లో జీతా లు వేస్తామని చెప్పి మాటతప్పింది. గడువు ముగిసి నాలుగు రోజులైనా న గదు వేయలేదు. అధికారులను అడిగితే మాకు తెలియదంటున్నారు. నిరుపేదలైన కార్మికులను ఇబ్బందిపెట్టడం సమంజసం కాదు. ఇప్పటికైనా వేతనాలు విడుదల చేయాలి.
– గ్యార పండు, జీపీ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు