Telangana | హైదరాబాద్ : తెలంగాణలో రేవంత్ సర్కార్ దెబ్బకి వెనక్కి తగ్గింది. పెన్షన్ రికవరీలు ఆపండంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రికవరీ నోటీసులపై ప్రభుత్వం అధికారులకు స్పష్టతనిచ్చింది. అనర్హులకు లబ్ది, రికవరీపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చించాలని నిర్ణయించినట్లు సీఎస్ శాంతి కుమార్ పేర్కొన్నారు. సంక్షేమ పథకాల్లో అనర్హులు లబ్ది పొందినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అర్హులకే లబ్ది అందేలా త్వరలోనే స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేస్తాం. మార్గదర్శకాలు ఇచ్చే వరకు రికవరీ నోటీసులు ఇవ్వొద్దు అని ఉత్తర్వుల్లో సీఎస్ శాంతి కుమారి పేర్కొన్నారు.
వృద్ధులకు అండగా నిలిచేందుకు కేసీఆర్ ప్రభుత్వం అందజేసిన ఆసరా పింఛన్లను వెనక్కి తీసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైన సంగతి తెలిసిందే. తాము అధికారంలోకి వస్తే పింఛన్ల మొత్తాన్ని రూ.రెండు వేల నుంచి రూ.నాలుగు వేలకు పెంచుతామన్న హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చకపోగా, ప్రస్తుతం వస్తున్న పెన్షన్లకే ఎసరు పెడుతున్నదని పలువురు వృద్ధులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
అధికారుల నిర్లక్ష్యం, బాధ్యతరాహిత్యంతో జరిగిన తప్పిదాలకు వారిని బాధ్యులను చేయకుండా పండుటాకులపై విరుచుకుపడుతున్న తీరు విమర్శలకు తావిస్తున్నది. రెండేసి పింఛన్లు తీసుకుంటున్నారంటూ పలువురు వృద్ధులకు నోటీసులు జారీ చేస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా శనివారం నాటికి 1,826 మందికి రికవరీ నోటీసులు జారీ చేసినట్టు ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించింది. పింఛన్లు తొలగించనున్న 1,826 మంది జాబితాను ఇప్పటికే రాష్ట్రస్థాయి అధికారులు జిల్లాలకు పంపించారు.
ఇప్పటివరకు పొందిన పింఛన్ మొత్తాన్ని తిరిగి ప్రభుత్వానికి చెల్లించాలని, లేదంటే ప్రభుత్వ పథకాలన్నింటిని నిలిపివేస్తామని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో పూట గడవడమే కష్టంగా ఉన్న తాము ఈ వయస్సులో డబ్బులు తిరిగి ఎలా చెల్లించగలమని నోటీసులు అందుకున్న వృద్ధులు లబోదిబోమంటున్నారు. ఎవరికైనా నిబంధనలకు విరుద్ధంగా రెండేసి పింఛన్లు వస్తున్నట్టయితే వాటిని గుర్తించి నిలిపివేయాల్సిన అధికారులు ఇన్నాళ్లు నిర్లక్ష్యంగా వ్యవహరించి, ఇప్పుడు హడావుడిగా నోటీసులు జారీ చేయడం ఏమిటని సామాజికవేత్తలు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వాటికి అధికారుల పొరపాటు, నిర్లక్ష్యం కారణమని, మొదట వారిపై చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.