హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ వైద్యవిధాన పరిషత్ పరిధిలోని దవాఖానల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ (స్పెషలిస్టు) పో స్టుల భర్తీలో సర్కార్ తీవ్ర జా ప్యం చేస్తున్నది. మొత్తం 1,623 పోస్టులకుగాను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నిరుడు ఆగస్టు 22 న నోటిఫికేషన్ విడుదల చేసింది. మల్టీ జోన్-1 పరిధిలో 858, మల్టీజోన్-2 పరిధిలో 765 పోస్టులకు గత సెప్టెంబర్లో దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా 692 పోస్టులకు అపాయింట్మెంట్ ఆర్డర్లను ప్రభుత్వం అందజేసింది. కానీ వీరికి పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వలేదు. మిగతా 931 మందికి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ జరగలేదు.
రాష్ట్రవ్యాప్తంగా టీవీవీపీ పరిధిలో 183 దవాఖానలు ఉన్నాయి. సివిల్ అసిస్టెంట్ సర్జన్ (స్పెషలిస్టు) పోస్టుల నియామకంలో జాప్యం కారణంగా ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతున్నది. అన్ని వైద్యసేవలకు ప్రభుత్వ దవాఖానలపై ఆధారపడటంతో తీవ్ర ప్రభావం పడుతున్నదని, టీవీవీపీ పరిధిలో స్పెషలిస్టు వైద్యుల పోస్టులు భర్తీ చేస్తే ఆ భారం తగ్గనుందని వైద్య వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు వైద్యుల కొరతతో ఇప్పటికే టీవీవీపీ పరిధిలోని దవాఖానల్లో పనిచేస్తున్న వైద్యులపై పనిభారం పడుతున్నదని పేర్కొన్నాయి. రోగులు సైతం స్పెషలిస్టులు లేకపోవడంతో ఆయా దవాఖానల్లో గంటల తరబడి వేచిచూసే దుస్థితి నెలకొన్నదని తెలిపాయి. నాణ్యమైన సేవలు అందించే స్పెషలిస్టు వైద్యుల పోస్టుల నియామకంలో జాప్యం కారణంగా ప్రజారోగ్యం ప్రమాదంలో పడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయాన్ని వైద్య శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని పలువురు అభ్యర్థులు వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి యుద్ధ ప్రాతిపదికన సివిల్ అసిస్టెంట్ సర్జన్ (స్పెషలిస్టు) పోస్టులను భర్తీ చేయాలని పలువురు అభ్యర్థులు కోరుతున్నారు.