Holiday | హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో ఈ నెల 6న ప్రభుత్వం సెలవు ప్రకటించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల పరిధిలోని ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థలు, కార్యాలయాలకు ఈ సెలవు వర్తించనుంది. సెప్టెంబర్ 6న సెలవు కారణంగా అక్టోబర్ 11వ తేదీ రెండో శనివారం రోజున పని చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.
ఇక గణేశ్ నిమజ్జనోత్సవానికి అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. నిమజ్జనం జరిగే ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్, నెక్లెస్ రోడ్డు మార్గాల్లో భారీ క్రేన్లను ఏర్పాటు చేశారు. వీలైనంత త్వరగా నిమజ్జనం ప్రక్రియను పూర్తి చేసేందుకు పోలీసులు కసరత్తు చేస్తున్నారు. ఇక నిమజ్జన ప్రక్రియను వీక్షించేందుకు హైదరాబాద్ నలుమూలల నుంచి కాకుండా జిల్లాల నుంచి తరలివచ్చే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపించేందుకు ఏర్పాట్లు చేసింది. నగరంలోని పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నారు.