వరంగల్, జూలై 31 (నూర శ్రీనివాస్) (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ పత్తి రైతుపై సర్కారు కత్తిగట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడబలుక్కొని పత్తిరైతును నిలువునా ముంచే భారీ కుట్రకు తెరలేపాయి. మధ్యప్రదేశ్‌లో విఫలమైన పథకాన్ని మన రాష్ట్రంలో అమలు చేయాలని చూస్తున్నాయి. పత్తి కొనుగోళ్ల నుంచి సీసీఐ తప్పుకొని ప్రైవేట్ వ్యాపారులకు అప్పగించేందుకు కాంగ్రెస్ సర్కారే తలారి పాత్ర పోషించే ప్రయత్నాలు చాపకింద నీరులా సాగుతున్నాయి. ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న పత్తి రైతును మళ్లీ అప్పుల ఊబిలోకి నెట్టే దారుణానికి రెండు ప్రభుత్వాలు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయి. ఇందుకోసం రాష్ట్ర మార్కెటింగ్ శాఖ తన యంత్రాంగాన్ని సన్నద్ధం చేస్తున్నది. ధర వ్యత్యాస చెల్లింపు పథకాన్ని (పీడీపీఎస్-ప్రైస్ డెఫిసియెన్సీ పేమెంట్ స్కీం) సర్కార్ పత్తి రైతుకు గురిపెట్టింది.
వరంగల్, ఆదిలాబాద్, నల్లగొండ జిల్లాల్లో ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు కసరత్తు సాగుతున్నది. ఈ పథకం అమలైతే సీసీఐ తన ఆపరేషన్స్ నుంచి తప్పుకుని వ్యాపారులు నిర్ణయించిన ధరలకు పత్తిరైతు విలవిల్లాడే ప్రమాదం పొంచి ఉన్నదని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేంద్రం నిర్ణయించిన కనిష్ఠ మద్దతు ధర (ఎంఎస్పీ)కు, వ్యాపారి కొనుగోలు చేసిన ధరకు ఉన్న వ్యత్యాసాన్ని రైతులకు ప్రభుత్వం చెల్లిస్తుందనే అందమైన అబద్ధానికి సమ్మతిని కూడగట్టే చర్యలు సాగుతున్నట్టు జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
కేంద్రం ధర నిర్ణయించి, రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో అమలయ్యేది ఎంఎస్పీ (కనిష్ట మద్దతు ధర). రైతులు పండించిన పంటలను దళారుల దోపిడీ నుంచి రక్షించే ఉద్దేశంతో నిర్ణయించే ధర. దీని స్థానంలో కేంద్రం ధర వ్యత్యాస చెల్లింపు పథకాన్ని (ప్రైస్ డెఫిసియెన్సీ పేమెంట్ స్కీం) రూపొందించింది. సీసీఐ పత్తి కొనుగోళ్ల నుంచి తప్పుకొని ఆ పనిని ప్రైవేట్ వ్యాపారులకు అప్పగిస్తుందన్నమాట. ప్రైవేట్ వ్యాపారి కొనుగోలు చేసిన సరుకుకు, ఎంఎస్పీకి ఉన్న తేడాను ప్రభుత్వం రైతుకు చెల్లిస్తుంది. ఇదే ధర వ్యత్యాస పథకం. ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందాలంటే రైతులు విధిగా రిజిస్టర్ చేసుకోవాలి.
వేస్తున్న పంట, ఎన్ని క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉన్నది? ఎప్పటిలోగా పంట చేతికి వస్తుంది? వంటి వివరాలను రైతులు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. వాటిని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. పంట చేతికొచ్చాక నోటిఫైడ్ మార్కెట్లో రైతులు తమ పంటను అమ్ముకోవాల్సి ఉంటుంది. నోటిఫైడ్ మార్కెట్లో నిర్దేశిత వ్యాపారి రైతు అమ్మిన పత్తికి సొమ్ము చెల్లిస్తాడు. రైతుకు ఆ వ్యాపారి చెల్లించిన ధరకు, ఆ సీజన్ ఎంఎస్పీకి నిర్దేశిత సగటు లేదా మాడల్ ధరకు మధ్య ఉన్న తేడాను ప్రభుత్వం రైతులకు వారివారి బ్యాంకు ఖాతాల్లో వేస్తుంది. ఇంకేముంది? సీసీఐ కొనుగోలు చేసినా.. వ్యాపారి కొనుగోలు చేసినా రైతుకు జరిగే నష్టం ఏమీలేదు కదా! అని పాలకులు చెప్తున్నారు. కానీ, ఇక్కడి నుంచే రైతుకు అసలు కథ మొదలవుతుంది.
ఒక రైతు 1 క్వింటాలు పత్తిని రూ.6,300కు ఒక వ్యాపారికి అమ్మాడు అనుకుందాం. ఈ సీజన్లో కేంద్రం పత్తికి ప్రకటించిన ఎంఎస్పీ రూ.8,110 పోలిస్తే సమ్మయ్యకు కేంద్రం చెల్లించాల్సిన తేడా రూ.1,810. ఈ మొత్తాన్ని కేంద్రం చెల్లించదు. సగటు ధర ఆధారంగా వచ్చిన తేడానే ప్రభుత్వం రైతుకు చెల్లిస్తుంది. సగటు ధర రూ.7,500 అనుకుందాం. ఈ సగటు ధరకు ఎంఎస్పీ (రూ.8110)కి మధ్య ఉన్న తేడా రూ.610. అంటే సమ్మయ్య క్వింటాలు పత్తికి పీడీపీఎస్ విధానంలో వచ్చింది రూ.6,910 మాత్రమే. ఇందులో 15 శాతం మాత్రమే చెల్లించాలన్న సీలింగ్‌లో సమ్మయ్యకు లభించింది 1 క్వింటాలుకు కేవలం 7.5 శాతమే. ప్రభుత్వం కొత్తగా తెచ్చే పీడీపీఎస్ విధానంతో ప్రయోజనం ఎవరికి?
మధ్యప్రదేశ్‌లో భవంతర్ భుల్తాన్ యోజన (బీబీవై)పీఎం ఆశా పథకంలో భాగంగా 2017 సెప్టెంబర్‌లో పీడీపీఎస్‌ను ప్రారంభించారు. సోయాబీన్, వేరుశనగ, నువ్వులు, మక్కజొన్న వంటి 8 రకాల పంటలకు వానకాలంలో ఈ పథకాన్ని అమలు చేశారు. ఆ సీజన్లో నోటిఫైడ్ మార్కెట్‌కు వచ్చిన సరుకుల ధర ఖరారైనప్పటి నుంచే అక్కడి రైతులు ఆందోళనబాట పట్టారు. ఈ పథకంలో పారదర్శకత లేదని, పీడీపీఎస్ వ్యాపారులకే మేలు చేస్తుందని రైతులు ఉద్యమించారు. వ్యాపారుల లాబీ మార్కెట్‌ను శాసించి ధరలను తన ఇష్టారీతిగా మార్చడంపై మధ్యప్రదేశ్ రైతులు ఉద్యమించారు.
పీడీపీఎస్ తమ భారాన్ని మరింత పెంచిందని, నోటిఫైడ్ మార్కెట్లో సగటు ధర నిర్ణయం కావడం, డీనోటిఫైడ్ ప్రాంతాల్లో పండించిన తమ పంటను నోటిఫైడ్ మార్కెట్లకు తరలించాల్సి రావడంతో వందలాది కిలోమీటర్ల దూరం కావడంతో రవాణా అదనపు భారం అయిందని రైతులు పోరాటాలకు దిగారు. రైతులకు ఎంఎస్పీని ఎగ్గొట్టేందుకు ప్రభుత్వానికి దొరికిన గొప్ప ఆయుధం ’పీడీపీఎస్’ పథకం అని మధ్యప్రదేశ్ అనుభవాలు చెప్తున్నాయని మార్కెట్ విశ్లేషకులు వివరిస్తున్నారు.
దేశంలో ఇప్పటిదాకా పీడీపీఎస్ ద్వారా లబ్ధిపొందిన రైతులు కేవలం 6,20,945 మంది మాత్రమే. ఇదెవరో కావాలనే చెప్తున్న లెక్కకాదు. సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ (లోక్ సభ)లో వెల్లడించిన అధికారిక లెక్క. 2025 ఏప్రిల్ 1వ తేదీన జీ సెల్వం, సీఎన్ అన్నాదురై, కే నవస్కని అనే ముగ్గురు ఎంపీలు అడిగిన ప్రశ్న (ప్రశ్న నంబర్ 4926)కు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాంనాథ్ ఠాగూర్ ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానం.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి (డిసెంబర్-మార్చి 2024-25) పొందిన రైతులు 10,04,67,693 కోట్ల మంది, దేశవ్యాప్తంగా ఈ-నామ్ (ఎలక్ట్రానిక్ మార్కెటింగ్)లో రిజిస్టర్ అయిన రైతులు 11 మిలియన్ల కన్నా ఎక్కువే. అదే, దేశవ్యాప్తంగా పీడీపీఎస్ ద్వారా లబ్ధిపొందిన రైతులు కేవలం 6 లక్షలు మాత్రమే. ఒకవేళ నిజంగా ఇది సూపర్ హిట్ పథకమే అయితే, రైతులకు మేలు చేసేదే అయితే 2017 నుంచి ఇప్పటికీ దేశమంతా విస్తృత ప్రచారం జరగాలి. అనేక రాష్ర్టాలు అమలు చేసేందుకు పోటీపడాలి. కానీ, అలాకాకుండా కేంద్రం దృష్టి తెలంగాణపైనే ఎందుకు పడింది? అనేది రైతులు, రైతు సంఘాల్లో ప్రశ్నార్థకంగా మారింది.
ఎంఎస్పీ, పీడీపీఎస్ వ్యత్యాసాన్ని లెక్కించడం దగ్గర మొదలైన గందరగోళం చెల్లింపుల వరకు కొనసాగుతుంది. డిమాండ్, సప్లయ్ సూత్రాలు.. మార్కెట్ పారిభాషిక వ్యవహారాలకు అనుగుణంగా సగటు ధర లేదా మోడల్ ధరను నిర్ణయిస్తారు. రాష్ట్రంలో ఆదిలాబాద్, నల్లగొండ, వరంగల్, ఖమ్మం, జమ్మికుంట, పెద్దపల్లి, భైంసా, జూలురుపాడు, తిరుమలగిరి, కేసముద్రం, మహబూబాబాద్, మద్దునూరు, తాండూరు, గద్వాల వంటి వ్యవసాయ మార్కెట్లలోనే పత్తి కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతాయి.
పీడీపీఎస్ మాడల్ ధర నిర్ణయం ఏ మార్కెట్ పరిధిలో వచ్చే సరుకు ఆధారంగా కా కుండా రాష్ట్రంలోని ఎంపిక చేసిన ఐదారు మార్కెట్ల ధరలను తీసుకొని సగటును నిర్ధారిస్తారు. ఆ సగటు ధరకు రైతుకు వచ్చిన ధరకు మధ్య ఉన్న తేడాను ప్రభుత్వం రైతు ఖాతాలో వేస్తుంది. ఆ సగటు ధరను వారానికో, 15 రోజులకో ఒకసారి మార్కెట్ బోర్డు నిర్ణయిస్తుంది. ఇక్కడ పత్తి నాణ్యతతో గానీ, నిర్దేశిత మార్కెట్ ఉండే దూరంతో కానీ సంబంధం లేదు. వ్యాపారి ఎంత అంటే అంతకు రైతు పంటను అమ్ముకోవాల్సిందే. పీడీపీఎస్ విధానం చెప్తున్నది అదే.
11 మిలియన్లు ఈ-నామ్ ద్వారా దేశవ్యాప్తంగా రిజిస్టర్ అయిన రైతులు
10,04,67,693 పీఎం కిసాన్ సమ్మాన్ నిధి (డిసెంబర్-మార్చి 2024-25) పొందిన రైతులు
6,20,945 పీడీపీఎస్ పథకం ద్వారా లబ్ధిపొందిన రైతులు