భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ)/ఖమ్మం/భద్రాచలం: అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అర్హులందరికీ అందాలని, ప్రభుత్వాలు చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శుక్రవారం గవర్నర్ పర్యటించారు. ఈ సందర్భంగా పలు అధికారిక కార్యక్రమాలకు హాజరయ్యారు. తొలుత భద్రాద్రి ఐడీవోసీలో జిల్లా అధికారులు, కళాకారులు, రచయితలు, ప్రముఖులతో నిర్వహించిన ముఖాముఖిలో పాల్గొన్నారు. గవర్నర్‌కు ఎంపీలు రఘురాంరెడ్డి, బలరాంనాయక్, ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, తెల్లం వెంకట్రావు, కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, ఐటీడీఏ పీవో రాహుల్, ఎస్పీ రోహిత్‌రాజ్ స్వాగతం పలికారు. జిల్లా ప్రాముఖ్యత, సంస్కృతి, సంప్రదాయాలు, వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి కలెక్టర్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గవర్నర్‌కు వివరించారు.
గవర్నర్ మాట్లాడుతూ.. జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరు బాగున్నదని ప్రశంసించారు. ముఖ్యంగా 2021లో 73 శాతంగా ఉన్న రక్తహీనత శాతాన్ని 2024 నాటికి 21 శాతానికి తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, విద్యాచందన, డీఎఫ్‌వో కిష్టాగౌడ్, ఆర్డీవోలు మధు, దామోదరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఖమ్మంలో పర్యటించిన గవర్నర్.. ‘ధర్మో రక్షతి రక్షితః’ అనే నినాదం ప్రకారం పర్యావరణాన్ని పరిరక్షించడం అందరి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఉదయం భద్రాచలం సీతారామచంద్రస్వామిని దర్శించుకున్న గవర్నర్‌కు అర్చకులు పరివట్టం కట్టి ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. తొలుత ధ్వజస్తంభం వద్ద పూజలు చేసిన తర్వాత గవర్నర్‌కు అర్చకులు పట్టువస్ర్తాలు, తీర్థప్రసాదాలు అందజేశారు.