హైదరాబాద్ మే 12 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర సమాచార హక్కుచట్టం కమిషనర్లుగా నలుగురు నియమితులయ్యారు. పీవీ శ్రీనివాస్‌రావు, పర్విన్ మోహిసిన్, దేశాల భూపాల్, బోరెడ్డి అయోధ్యరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులను జారీచేసింది. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్‌గా రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి చంద్రశేఖర్‌రెడ్డిని నియమించగా, ఇప్పటికే ఆయన బాధ్యతలను స్వీకరించారు. ప్రభుత్వం గత ఏప్రిల్‌లో చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్‌కు ఒకరు, కమిషనర్ పదవులకు ఏడుగురి పేర్లతో జాబితాను గవర్నర్‌కు సిఫారసు చేసింది.
ఇందులో నలుగరు కమిషనర్ల నియామకానికి గవర్నర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. కప్పర హరిప్రసాద్, వైష్ణవి, రాములు ఎంపికపై సందిగ్ధం నెలకొన్నది. ఇదిలా ఉండగా, సీఎం కార్యాలయంలో సీపీఆర్వోగా పనిచేస్తున్న బోరెడ్డి అయోధ్యరెడ్డి ఎంపికపై దుమారం రేగుతున్నది. ఆయన కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. పూర్తిస్థాయిలో రాజకీయ నేపథ్యం ఉన్నది. పక్కా రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తిని సమాచార కమిషనర్‌గా ఎలా నియమిస్తారని పలువురు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజాసంఘాల నాయకులు అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారు. అర్హులను పక్కనబెట్టి అర్హతలేని వారిని అందలమెక్కించడంలోని మతలబు ఏమిటని ప్రశ్నిస్తున్నారు.