హైదరాబాద్, ఏప్రిల్16 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ప్రభుత్వం కులాలవారీగా వెల్లడించిన గణాంకాలపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతున్నది. ఆ వివరాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆలయ ప్రవేశాలకు ఓసీలే అధికంగా వివక్షకు గురవుతున్నారని నివేదించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇది గణాంకాల్లోని డొల్లతనాన్ని బయటపెడుతున్నదని కుల సంఘాలు మండిపడుతున్నాయి. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, ముస్లింమైనార్టీలు, ఓసీలు కలిపి మొత్తంగా 242 కులాలు, ఉపకులాల వారీగా వాటి జనాభాను, ఆర్థిక, సామాజిక, విద్యా, ఉద్యోగ, ఉపాధి తదితర స్థితిగతుల గణాంకాలను ప్రభుత్వం వెల్లడించింది. అందులో చాలా ఆసక్తికరమైన విషయాలు, అసంబద్ధమైన విషయాలు ఉండటమే ఇప్పుడు చర్చనీయాంశమైంది. క్షేత్రస్థాయి పరిస్థితులకు భిన్నంగా నివేదిక ఉన్నదని విమర్శలు వినిపిస్తున్నాయి.
కులాంతర వివాహాలు ఇతర అన్ని వర్గాల కంటే ఓసీల్లోనే ఎక్కువున్నాయని నివేదిక వెల్లడించింది. మరోవైపు 95 శాతం కులంలోనే వివాహాలు కుదుర్చుకుంటున్నాయని తెలిపింది. తెలంగాణలో సగటు స్త్రీ-పురుష నిష్పత్తి 0.98గా ఉందని, స్త్రీ-పురుష నిష్పత్తిలో అసమతుల్యత లింగ ఆధారిత వివక్షను తేటతెల్లం చేస్తున్నది. అందులోనూ ఓసీ కులాల్లో స్త్రీ పురుష నిష్పత్తి రాష్ట్ర సగటు కంటే తకువగా ఉండటం గమనార్హం. బాల్యవివాహాలు సైతం బీసీల తర్వాత ఓసీ కులాల్లోనే ఎక్కువగా ఉండగా, అత్యల్పంగా ఎస్టీల్లో ఉండటం విస్మయం గొలుపుతున్నది. స్కూల్ డ్రాపౌట్స్లో రాష్ట్ర సగటు 2.2శాతం కాగా, ఎస్టీ, బీసీల్లో ఎక్కువగా ఉండగా, ఎస్సీ, ఓసీల్లో సమానంగా ఉండటం విశేషం. వీధివ్యాపారాల ద్వారా స్వయం ఉపాధి పొందే వారి రాష్ట్ర సగటు 4.7శాతం కాగా, అందులో బీసీలే అత్యధికం. ఆ తరువాత ఓసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఉన్నారు. కులవృత్తిలో కొనసాగుతున్నవారి రాష్ట్ర సగటు 6.8శాతం కాగా బీసీలు 10.4శాతం మంది ఉన్నారు. ఆ తరువాత ఎస్సీలు, ఓసీలే ఉన్నారు.
తెలంగాణలోని వివిధ సామాజికవర్గాల మధ్య ఉన్న తీవ్రమైన ఆర్థిక, వృత్తిపరమైన అసమానతలను నివేదిక వెల్లడించింది. ప్రైవేట్ రంగంలోనూ ఇతర వర్గాల కంటే ఐదు రెట్లు ఓసీలు అధికంగా ఉండటం గమనార్హం. ఇది ఓసీలకున్న విద్యావకాశాలు, పట్టణ నెట్వర్లను సూచిస్తున్నదని సర్కార్ తెలిపింది. ఉన్నత కులాలు ఆర్థికంగా స్థిరమైన, గౌరవప్రదమైన వృత్తుల్లో ఉండగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు ఇంకా తకువ ఆదాయం వచ్చే అస్థిరమైన పనుల్లోనే కొనసాగుతున్నారని స్పష్టంచేసింది. భూ యాజమాన్యం సామాజికవర్గాల మధ్యనున్న ఆసక్తికరమైన వ్యత్యాసాలను వెల్లడిస్తున్నది. సాధారణంగా ఆర్థికంగా వెనుకబడినవర్గాలకు ఆస్తులు తకువగా ఉంటాయని భావిస్తాం. కానీ, ఇకడ ఎస్టీలు అత్యధిక భూ యాజమాన్యాన్ని కలిగి ఉన్నారని నివేదిక తెలిపింది. అయితే వారు సంప్రదాయకంగా అటవీ, వ్యవసాయ భూములపై ఆధారపడి ఉండటాన్ని అది స్పష్టం చేస్తున్నది. ఆ భూమి నాణ్యత, దాని ద్వారా వచ్చే ఆదాయమెంతనే దాన్ని కూడా విశ్లేషించాల్సిన అవసరముందని, నిర్మాణాత్మక అసమానతలు, భూమి ఉండటం ఒక ఎత్తయితే ఆ భూమి విస్తీర్ణం, విలువలోని వ్యత్యాసాలు వేరే అని నివేదిక తెలిపింది.
