CM Revanth Reddy | హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): గురుకుల విద్యాసంస్థల ద్వారా కుటుంబ సంబంధాలు బలహీనమవుతున్నట్టు ఒక స్టడీ రిపోర్టు వెల్లడించిందని, దీనిపై మరింత లోతుగా విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉన్నదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని సర్కారు స్కూళ్లను సెమి రెసిడెన్షియల్‌గా మార్చే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తున్నదని వెల్లడించారు. విద్యార్థులకు ఉద యం బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్‌కు సమకూర్చాలన్న ప్రతిపాదన వచ్చిందని, దీనిని పరిగణనలోకి తీసుకుని సెమి రెసిడెన్షియల్ విధానాన్ని అమలుచేస్తామని వివరించారు. సోమవారం ఆయన రవీంద్రభారతిలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘ఈ మధ్య కాలంలోనే ఒక స్టడీ రిపోర్ట్ చూసిన. దానిని లోతుగా విశ్లేషించాల్సి ఉన్నది.
తెలంగాణలో చాలా రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చాయి. అవి విద్యను పెంచడానికి పనికొచ్చినా, వాటిలో చిన్న వయస్సులోనే పిల్లలను చేర్చడం వల్ల తల్లిదండ్రుల మధ్య కుటుంబ సంబంధాలు బలహీనపడుతున్నాయని స్టడీ రిపోర్టు వచ్చింది. పిల్లలకు అమ్మ ఒడే ప్రథమ పాఠశాల. అమ్మ ఒడిలోనే చాలా నేర్చుకునే అవకాశం ఉంటుంది. రెసిడెన్షియల్స్ స్కూల్స్ వల్ల, పేదరికం వల్ల అమ్మ ఒడిలో చదువుకోవాల్సిన విద్యార్థులు రెసిడెన్షియల్స్ స్కూల్స్‌లో చేరుతున్నారు. కుటుంబ సంబంధాలు బలహీనమవుతున్నాయి. ఇది భవిష్యత్తులో సామాజిక సమస్యగా మారడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూల్స్‌ను ప్రోత్సహిస్తూనే, గ్రామాల్లోనే తల్లిదండ్రుల దగ్గరే పెరుగుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవడానికి కావాల్సిన వసతులను కల్పించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నది’ అని చెప్పారు. ఈ సందర్భంగా సర్కారు స్కూళ్ల మూసివేతపై సీఎం కీలక వ్యా ఖ్యలు చేశారు.
‘కొంతకాలంగా సర్కారు స్కూ ళ్లు నిర్వీర్యమవుతున్నాయి. స్కూళ్లల్లో టీచర్లు లేరని విద్యార్థులు రావడంలేదు. విద్యార్థులు లేరని బడులు మూసేస్తున్నారు. ఇది కోడి ముందా? గుడ్డు ముందా? అన్నట్టుగా తయారయ్యింది. టీచర్లను నియమించకపోతే విద్యార్థులు రారు. విద్యార్థులు లేరనే నెపంతో సింగిల్ టీచర్ స్కూళ్లను మూసివేసే పరిస్థితి ఉన్నది’ అని వ్యాఖ్యానించారు. కొన్ని పాఠశాలల్ల్లో 8-9 మంది విద్యార్థులు ఉంటే 10-12 మంది టీచర్లు ఉన్నారని చెప్పారు. పిల్లలు చేరపోతే బడులు మూతబడుతాయని, పిల్లలు వి ద్యకు దూరమవుతారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని బడిబాటలో భాగంగా తల్లిదండ్రులకు వివరించాలని ఉపాధ్యాయులకు సూచించా రు. సింగిల్ టీచర్ పాఠశాలలను మూసివేయొద్దని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. ప్రతి గ్రామం, తండాకు విద్యను అందించే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుందని భరోసా ఇచ్చా రు. శిథిలావస్థలో ఉన్న పాఠశాలల భవనాలను పునర్నిర్మించేందుకు రూ.2 వేల కోట్లతో పనులు ప్రారంభించామని వెల్లడించారు.