హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): హ్యామ్ రోడ్ల టెండర్లపై కాంగ్రెస్ సర్కార్ యూటర్న్ తీసుకొన్నది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ దెబ్బకు రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. 5% ఎక్సెస్ నిబంధనను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారని, 22 నుంచి 25% ఎక్సెస్‌కు ఖరారు చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ ఆధారాలు చూపి ఆరోపణలు చేసింది. గత అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ పక్షాన డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు మాట్లాడుతూ.. హ్యామ్ టెండర్లలో సర్కార్ అక్రమాలకు తెరతీసిందని, ప్రజాధనాన్ని లూటీ చేసేందుకు యత్నిస్తున్నదని గళమెత్తారు. ఈ నేపథ్యంలో శనివారం జరిగిన క్యాబినెట్ మీటింగ్‌లో ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా 441 ఆర్అండ్బీ రోడ్లను 34 ప్యాకేజీల్లో రూ.13,006.27 కోట్లతో 6,092.37 కిలోమీటర్ల మేరచే పట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా పంచాయతీరాజ్ ద్వారా 2,162 పల్లెల్లోని రోడ్లను 7,450 కిలోమీటర్ల మేర 17 ప్యాకేజీల్లో చేపట్టాలని నిర్ణయించింది. సుదీర్ఘ సమాలోచనల అనంతరం టెండర్లు 5% కంటే ఎక్కువకు కోట్ కాకుండా ఖరారు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీచేసినట్టు సమాచారం. రాష్ట్ర ఆవిర్భావ దినమైన జూన్ 2నాటికి పనులకు శంకుస్థాపనలు చేసేలా చర్యలు చేపట్టాలని నిర్దేశించినట్టు తెలిసింది.
ఇటీవల అధికారులు హ్యామ్ టెండర్ల ఫైనాన్షియల్ బిడ్లను తెరిచారు. కాంట్రాక్టర్లు అంచనాలకు మించి అధిక ధరలకు కోట్ చేశారు. సు మారు 20% నుంచి 75% ఎక్సెస్‌కు దాఖలు చేశారు. అత్యధికంగా సిద్దిపేటలో 75% ఎక్సెస్ తో కీస్టోన్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కోట్ చేయడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో అధికారు లు ఇందుకు సంబంధించిన వివరాలను తాజా క్యాబినెట్ భేటీలో మరోసారి నివేదించారు. ఈ సందర్భంగా గంటకుపైగా చర్చోపచర్చలు చేసిన తర్వాత సీఎం మాట్లాడుతూ.. ఎట్టిపరిస్థితుల్లో నూ 5 శాతానికి మించి టెండర్ కోట్ కాకుండా చర్యలు చేపట్టాలని స్పష్టంచేసినట్టు తెలిసింది.
హైబ్రిడ్ యాన్యుటీ మాడల్ (హ్యామ్)లో రోడ్ల నిర్మాణంపై బీఆర్ఎస్ మొదటినుంచీ అభ్యంతరం వ్యక్తంచేస్తున్నది. ఈ విధానం తెలంగాణకు పనికిరాదని చెప్తున్నది. ప్రభుత్వం ప్రజాధనాన్ని బడా కాంట్రాక్టర్లకు అప్పనంగా అప్పజెప్పే కుట్రలు చేస్తున్నదని ఆరోపించింది. అటూ అసెంబ్లీలోనూ, ఇటూ వివిధ వేదికల ద్వారా గళమెత్తింది. గత అసెంబ్లీ సమావేశాల్లో మాజీ మంత్రి హరీశ్‌రావు ఆధారాలు చూపుతూ ప్రభుత్వాన్ని ఎండగట్టారు. 22% నుంచి 25% ఎక్సెస్‌కు టెండర్లు కట్టబెట్టే కుట్రలు చేస్తున్నదని విరుచుకుపడ్డారు. రోడ్లు, భవనాల శాఖ మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి సైతం ఈ అంశాన్ని లెవనెత్తారు. ప్రభుత్వ పెద్దలు కమీషన్ల కోసమే ఈ విధానం తీసుకొచ్చారని ఆరోపించారు. అయితే, బీఆర్ఎస్ అనవసర రాజకీయం చేస్తున్నదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎదురుదాడికి దిగారు. అక్రమాలకు అవకాశంలేదని వితండవాదన చేశారు. ఆ తరువాత మే 1వ తేదీన హ్యామ్‌రోడ్ల టెండర్లను ఓపెన్ చేసిన సందర్భంలోనూ హరీశ్‌రావు మీడియాతో చేసిన చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ పార్టీ చేసిన ఆరోపణలు నిజమేనని నిరూపితమైందని పేర్కొన్నారు. ఆర్‌అండ్‌బీలో రూ.11 వేల కోట్లకు టెండర్లు పిలిస్తే, ఎక్సెస్‌తో కలిపి రూ.15 వేల కోట్లు అయిందని, పంచాయతీరాజ్‌లో రూ.6 వేల కోట్లకు టెండర్లు పిలిస్తే, రూ.7వేల కోట్ల నుంచి రూ.8 వేల కోట్లకు ఎక్సెస్ అయిందని వివరించారు. ఈ లెక్కన సుమారు రూ.5 వేల కోట్లు కొల్లగొట్టే కుటిలయత్నం జరుగుతున్నదని, హ్యామ్ విధానంలో 40 శాతానికిపైగా ప్రభుత్వంపై అదనపు భారం పడనున్నదని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో తాజాగా క్యాబినెట్ తీసుకొన్న నిర్ణయాలతో బీఆర్ఎస్ చెప్పిందే నిజమైందని పలువురు రిటైర్డ్ ఇంజినీర్లు వ్యాఖ్యానిస్తున్నారు. బీఆర్ఎస్ పోరాటం ఫలించిందని, రాష్ట్ర ఖజానాపై సుమారు 40% అదనపు భారం తప్పిందని చెప్తున్నారు. ఇదీ ముమ్మాటికీ తమ విజయమేనని బీఆర్ఎస్ పార్టీ నేతలు స్పష్టంచేస్తున్నారు.
తాజాగా ప్రభుత్వం 5% కంటే ఎక్సెస్‌కు టెండర్లు ఖరారు చేయొద్దని నిర్ణయించడంతో కథ మళ్లీ మొదటికొస్తున్నదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల సర్కార్ గుత్తేదారులకు అనుకూలంగా నిబంధనలు సవరించింది. రిజర్వ్‌బ్యాంక్ ద్వారా చెల్లింపులు చేస్తామని చెప్పడంతో బిడ్లు దాఖలు చేశారు. 22% నుంచి 73% అధికంగా కోట్ చేశారు. అయితే ప్రస్తుతం 5 శాతానికి మించిన ఎక్సెస్‌తో టెండర్లు కట్టబెట్టవద్దని ప్రభుత్వం నిర్ణయించడంతో గుత్తేదారులు అసహనం వ్యక్తంచేస్తున్నారు. ఇలాగైతే పనులు చేపట్టబోమని చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో హ్యామ్ రోడ్ల నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నట్టేనని ఇంజినీరింగ్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో జూన్ 2న శంకుస్థాపనలు చేయాలన్న సీఎం ఆదేశాలు ఏమేరకు అమలవుతాయనేది అనుమానాస్పదంగా మారింది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన హ్యామ్ విధానంలో రోడ్ల నిర్మాణానికి అడ్డంకులే ఎదురవుతున్నాయి. ఈ విధానంలో 40% నిధులను ప్రభుత్వం సమకూరుస్తుంది. మిగిలిన 60% నిధులను కాంట్రాక్టర్లు బ్యాంకుల ద్వారా లోన్ల రూపంలో తీసుకొనే అవకాశం కల్పించింది. 15 ఏండ్లలోగా రుణాలు చెల్లించేలా నిబంధనలు రూపొందించారు. ఈ మాడల్ ఏడాదిన్నర నుంచి కాగితాలమే పరిమితమైంది. పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో పదే పదే వాయిదావేస్తూ వస్తున్నారు. గత సంవత్సరం నవంబర్‌లో ఈ ప్రాజెక్టు కింద ఫస్ట్ ఫేస్‌లో రూ.11,399 కోట్లతో 5,824 కిలోమీటర్ల ఆర్అండ్బీ రోడ్లు, రూ.6,299 కోట్లతో 7,449 కిలోమీటర్ల పంచాయతీరాజ్ రోడ్లను నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈవోఐ)ను ఆహ్వానించారు. అయితే, ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తుందో లేదోననే అనుమానంతో కాంట్రాక్టర్లు సుముఖత చూపలేదు. ఈ పరిస్థితుల్లో ఏజెన్సీల నెట్‌వర్త్‌ను 20% నుంచి 15 శాతానికి కుదించింది. నిబంధనల్లోనూ మార్పులు చేసింది. ప్రభుత్వం డెడికేటెడ్ మెకానిజం పద్ధతిలో గుత్తేదారులకు బిల్లులు చెల్లించాలని నిర్ణయించింది. మొదట ఆర్అండ్బీ, ఆ తర్వాత పంచాయతీరాజ్ శాఖల నుంచి బిల్లులు చెల్లిస్తారు. ఒకవేళ చెల్లింపుల్లో జాప్యమైతే పేమెంట్ సెక్యూరిటీ ఫండ్ ద్వారా, ఇంకా ఆలస్యమైతే రిజర్వ్‌బ్యాంక్ ద్వారా చెల్లించేలా నిబంధనలు రూపొందించారు.