వర్ని, జనవరి 17: దేశంలో నిరుపేదలను ఆదుకునేది తెలంగాణ ప్రభుత్వమేనని శాసనసభ స్పీకర్ పోచారంశ్రీనివాస రెడ్డి అన్నారు. అత్యధికంగా నిరుపేదలకు పింఛన్లను ఇస్తున్నదని కొనియాడారు. వర్ని మండలం పొట్టిగుట్ట తండాలో మంగళవారం రూ.17లక్షలతో నిర్మించిన పాఠశాల భవనాన్ని, రూ.5లక్షలతో నిర్మించనున్న సేవాలాల్ మహరాజ్ ఆలయ ప్రహరీ నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. అనంతరం గ్రామంలో లబ్ధిదారు నిర్మించుకున్న డబుల్ బెడ్రూం ఇంటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ సంక్షేమ పథకాల ద్వారా నిరుపేదలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే నెంబర్‌వన్ స్థానంలో ఉందన్నారు. నిరుపేదలకు వివిధ రకాలుగా రూ.15వేల కోట్లతో పింఛన్లను పంపిణీ చేస్తున్నదని, కేవలం బాన్సువాడ నియోజకవర్గంలోనే 43వేల మందికి పింఛన్లు వస్తున్నట్లు వెల్లడించారు. నిరుపేద యువతుల పెండ్లి కోసం సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకాన్ని రూపొందించారన్నారు.
బాన్సువాడ నియోజకవర్గంలో వంద శాతం వ్యవసాయ భూములకు సాగునీరందించడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. జాకోరా, చందూరు, చింతకుంట ఎత్తిపోతల పథకాల ద్వారా నిజాంసాగర్ ఆయకట్టేతర రైతులకు జూన్ నాటికి సాగునీరందిస్తామన్నారు. రూ.120కోట్లతో సిద్ధాపూర్ రిజర్వాయర్ పనులు చురుగ్గా సాగుతున్నాయని తెలిపారు. ఆరోగ్య సిబ్బంది, ఆశ వర్కర్లు, అంగన్వాడీ ఉపాధ్యాయుల చేతుల్లోనే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం ఉన్నదన్నారు. పాఠశాలలో సౌకర్యాల కల్పనకు మరిన్ని నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఇద్దరు లబ్ధిదారులకు షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో వర్ని జడ్పీటీసీ బర్దావల్ హరిదాస్, ఏఎంసీ వైస్ చైర్మన్ వెలగపూడి గోపాల్, వైస్ ఎంపీపీ దండ్ల బాలరాజు, కో ఆప్షన్ సభ్యుడు కరీం, ఎంపీటీసీ సభ్యుడు ఎందుగుల సాయిలు, సర్పంచ్ పాత్లోత్ శోభ, ఉప సర్పంచ్ ప్రశాంత్, బీఆర్ఎస్ నాయకులు కల్లాలి గిరి, మూడ్ అంబర్‌సింగ్, సర్పంచులు పద్మా జగ్రాం, శ్రీనగర్ రాజు, నెహ్రూనగర్ సత్తిబాబు, సహకార సంఘం అధ్యక్షుడు నామాల సాయిబాబు, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎత్తిపోతల పథకం పనుల పరిశీలన
చందూర్, జనవరి 17: జాకోరా, చందూర్ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పైపులను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మంగళవారం నస్రుల్లాబాద్‌లో పరిశీలించారు. ఆయన వెంట ఇరిగేషన్ ఎస్ఈ వాసంతి, డీఈ శ్రావణ్‌కుమార్‌రెడ్డి, ఏఈ జీవన్, లక్ష్మాపూర్ సర్పంచ్ బొడ్డోల్ల సత్యనారాయణ, డీలర్ నర్సింములు, చింతం శ్రీనివాస్, బీ హన్మాండ్లు, లింగేశం, చింతం సంజీవ్, గొల్ల చిన్న సాయిలు తదితరులు ఉన్నారు.