హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి, వారి హక్కుల రక్షణకు అండగా ఉంటున్నదని దివ్యాంగుల సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. డిసెంబర్ 3న ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్లోని మహిళా, శిశు, దివ్యాంగుల సంక్షేమశాఖ కార్యాలయంలో శనివారం ఆయన పోస్టర్ను ఆవిషరించారు. అనంతరం మంత్రి కొప్పుల మాట్లాడుతూ.. దివ్యాంగుల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నదని తెలిపారు. దివ్యాంగుల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ నిర్వహణకు ప్రతి జిల్లాకు రూ.50 వేలు విడుదల చేసినట్టు వెల్లడించారు. కార్యక్రమంలో దివ్యాంగుల సంక్షేమ శాఖ చైర్మన్ వాసుదేవరెడ్డి, దివ్యాంగులశాఖ కార్యదర్శి దివ్యదేవరాజన్, డైరెక్టర్ శైలజ పాల్గొన్నారు.