ములుగు, (నమస్తే తెలంగాణ)/ సారంగాపూర్/చిలిపిచెడ్(కొల్చారం)/రాజాపేట, మే18: కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం పలు జిల్లాల్లో అన్నదాతలు ఆందోళనలు చేపట్టారు. రైతులు పండించిన అన్ని రకాల పంటలకు క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొనుగోళ్లలో జాప్యం లేకుండా చూడాలని, ధాన్యాన్ని వెంటవెంటనే మిల్లులకు తరలించాలని అధికారులను వేడుకున్నారు. ఇందులో భాగంగా.. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం నర్సింహులపల్లి ప్రధాన రహదారిపై రైతులు నిరసన తెలిపారు. రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ నిర్వహించిన ధర్నాలో కేడీసీసీబీ డైరెక్టర్ ముప్పాల రాంచందర్‌రావు, మాజీ ఎంపీపీ కొల్ముల రమణ మాట్లాడుతూ.. అకాల వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారని, కేంద్రాల్లో తడిసిన ధాన్యంలో కోతలు విధించకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ ధర్నాలో రైతుబంధు సమితి మండల మాజీ సభ్యులు మెరుగు రాజేశం, ఎంపీటీసీ ఎడ్ల సృజన సుశిన్, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి శీలం రమేశ్, మాజీ సర్పంచ్ శీలం రవి, తాడుక మల్లేశం పాల్గొన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం దుంపలకుంట గ్రామ రైతులు తూకం వేసిన వరి ధాన్యం తరలించడం లేదని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. తూకం వేసిన ధాన్యం బస్తాలు తరలించడంలో జాప్యం, సన్నరకం ధాన్యం తూకం వేయకపోవడాన్ని నిరసిస్తూ ఎనగండ్ల గ్రామ పంచాయతీ పరిధిలోని దుంపకుంట గ్రామంలో ధాన్యం బస్తాలతో మెదక్-సంగారెడ్డి రహదారిపై రైతులు పెద్ద ఎత్తున రాస్తారోకోకు దిగారు. రైతులు రోడ్డు ఎక్కడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యింది.
కొల్చారం ఎస్సై మహ్మద్‌గౌస్ తన సిబ్బందితో అక్కడికి చేరుకొని రైతులను సముదాయించారు. తూకం వేసిన ధాన్యాన్ని తరలించే వరకు కదిలేది లేదని రైతులు భీష్మించుకొని కూర్చున్నారు. అనంతరం తహసీల్దార్ గఫార్‌మియా రైతుల వద్దకు చేరుకుని నర్సాపూర్ ఆర్డీవోతో ఫోన్లో మాట్లాడించారు. తూకం వేసిన ధాన్యం తరలించేందుకు చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. నెల గడుస్తున్నా ఐకేపీ సెంటర్లో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో వానకు తడిసి మొలకెత్తిందని, ప్రభుత్వం వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా పాముకుంట రైతులు రాజాపేట మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. పీఏసీఎస్ చైర్మన్ నిలదీత
లారీ యజమానులు, రైస్ మిల్లర్లు కలిసి ధాన్యాన్ని తరలించకుండా, లారీలు రాకుండా చేయడంతో ములుగు జిల్లా ములుగు మండలం జంగాలపల్లి గ్రామంలోని పీఏసీఎస్ కొనుగోలు కేంద్రం వద్ద రైతులు పీఏసీఎస్ చైర్మన్ చిక్కుల రాములును నిలదీశారు. తమ వడ్లను 20 రోజులుగా ఎందుకు కొనుగోలు చేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చిన లారీలను ఖాళీగా పంపించడమేంటని మండిపడ్డారు. గురు, శుక్రవారాల్లో కురిసిన వర్షానికి రైతుల ధాన్యం తడిసిముద్దయిందని, కాంటాలు వేసిన వడ్ల బస్తాలు సైతం తడిసిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం సివిల్ సప్లయ్ డీఎం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, కాంటాలు వేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించాలని ఆదేశించినా.. కొనుగోలు కేంద్రం నిర్వాహకులు పట్టించుకోలేదని వాపోయారు.
కామారెడ్డి మండలం క్యాసంపల్లిలో రెండు రోజుల క్రితం కురిసిన వర్షానికి వరి ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. రైతులు 20 రోజులుగా ధాన్యం కుప్పలకు కాపలా కాస్తున్నా.. కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకురాలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. 20 రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ఉండటంతో కురుస్తున్న అకాల వర్షాలకు ధాన్యం తడిసి మొలకలు వస్తున్నాయని వాపోయారు.