Internal Marks | హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): పదో తరగతిలో ఇంటర్నల్ మా ర్కుల రద్దు నిర్ణయాన్ని ప్రభుత్వం స్వల్పంగా సవరించింది. ఈ ఒక్క విద్యాసంవత్సరంలో ఇంటర్నల్ మార్కులను తిరిగి పునరుద్ధరిస్తున్నట్టు వెల్లడించింది. విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం శుక్రవారం పాత ఉత్తర్వులను సవరించి కొత్త ఉత్తర్వులను విడుదల చేశారు.
పదో తరగతి వార్షిక పరీక్షల్లో గ్రేడింగ్‌ను రద్దు చేయడమే కాకుండా ఇంటర్నల్స్‌ను తొలగిస్తూ.. ఈ ఏడాదే నుంచే ఈ విధానాన్ని అమలుచేస్తామని ప్రభుత్వం గురువారం ఉత్తర్వులిచ్చింది. 80శాతం మార్కులకు బదులుగా 100శాతం మార్కులకు పదో తరగతి వార్షిక పరీక్షలను నిర్వహిస్తామని తెలిపింది. అయితే ఇప్పటికే సగం విద్యాసంవత్సరం గడిచిపోయింది.
విద్యాసంవత్సరం మధ్యలో నిర్ణయాలను మార్చడంపై కొన్ని ఉపాధ్యాయ సంఘాలు, ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్య సంఘాలు తప్పుపట్టాయి. దీంతో ఈ ఒక్క ఏడాదికి ఇంటర్నల్స్‌ను కొనసాగించాలని తాజాగా ఉత్తర్వులిచ్చారు. అయితే 2025-26 విద్యాసంవత్సరం నుంచి ఇంటర్నల్స్ ఉండవు. మొత్తం 100 మార్కులకు వార్షిక పరీక్షలను నిర్వహిస్తారు. అయితే గ్రేడింగ్ విధానం రద్దు విషయంలో తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు.
ఈ విద్యాసంవత్సరం నుంచే గ్రేడింగ్ ఉండదు. మార్కులనే కేటాయిస్తారు. ఇలా ఇంటర్నల్స్ రద్దు చేశామని ప్రకటించి ఒక రోజు గడవక ముందే ఇంటర్నల్స్ ఉంటాయని ఉత్తర్వులివ్వడం అటు టీచర్లను, ఇటు విద్యార్థులను గందరగోళానికి గురిచేసింది. ఇలాంటి అనాలోచిత నిర్ణయాలతో గందరగోళం సృష్టించవద్దని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి.
విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా గ్రేడింగ్ విధానాన్ని కొనసాగించాలని తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ (ట్రస్మా) ప్రభుత్వాన్ని కోరింది. మార్కుల విధానంతో విద్యార్థులపై ఒత్తిడి ఉంటుందని పేర్కొన్నది.