సాక్ష్యం-1 : చంద్రబాబు కన్నుపడ్డప్పుడే విద్యార్థుల ఆందోళన.. వర్సిటీది కాకుంటే ఆందోళన ఎందుకు చేస్తరు?
సాక్ష్యం-2 : ఆ భూమికి బదులుగా వేరే భూమి ఇస్తానన్న బాబు. అంటే ఈ భూమి వర్సిటీదేనని ఒప్పుకున్నట్టేకదా!
సాక్ష్యం-3 : ఆ భూమిలోని జింకలు, రాళ్లు, పక్షులే హెచ్‌సీయూ అధికారిక వెబ్సైట్లో చిహ్నాలు. అనుబంధానికి ఇంతకుమించి ఇంకేం కావాలి?
హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 31 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని 400 ఎకరాలను హెచ్సీయూకు చెందకుండా చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది. కానీ నిజం ఎన్నటికీ అబద్ధం కాలేదనే సత్యాన్ని గ్రహించలేకపోతున్నది. ఈ 400 ఎకరాలకు బదులు గోపన్‌పల్లి తండాలో 2004లోనే 397 ఎకరాలు కేటాయించినట్టు పాత డాక్యుమెంట్లను సోషల్ మీడియాలో లీక్ చేసి సెల్ఫ్‌గోల్ చేసుకున్నది. ఆ 400 ఎకరాలు హెచ్సీయూవి కాబట్టే మరోచోట భూములను కేటాయించారనే విషయాన్ని గుర్తించలేకపోయింది. హెచ్‌సీయూలో టీజీఐఐసీ అధికారికంగా సర్వే చేపట్టలేదని, వారి ప్రకటన పూర్తిగా అబద్ధమని స్వయంగా రిజిస్ట్రార్ ప్రకటించడంతో సర్కారు తీరు బట్టబయలైంది. ఆ భూములు హెచ్‌సీయూవే అనేందుకు సాక్ష్యాలు కళ్లముందు ఉన్నాయి.
కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల హెచ్‌సీయూ భూములను నాటి చంద్రబాబు ప్రభుత్వం 2003లో ఐఎంజీ భారత్‌కు కేటాయించింది. యూనివర్సిటీ భూములను ప్రైవేట్ సంస్థకు అప్పగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ విభాగం, విద్యార్థులు ఉధృతంగా ఆందోళనలు చేపట్టారు. తమ యూనివర్సిటీ భూములను ప్రైవేట్ సంస్థకు ఎలా అప్పగిస్తారని పోరాటం చేశారు.
విద్యార్థుల ఆందోళనలకు దిగొచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఈ భూములకు బదులుగా 2004 జనవరిలో గోపన్‌పల్లిలో 397 ఎకరాల భూమిని కేటాయించింది. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ భూముల్లో 200 ఎకరాలను కేంద్ర సంస్థలైన టాటా ఇన్స్టిట్యూట్ ఫర్ ఫండమెంటల్ రీసెర్చ్‌కు, మరో 100 ఎకరాలను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ యానిమల్ బయోటెక్నాలజీకి అప్పగించింది. మరి ఆ 400 ఎకరాల భూమి యూనివర్సిటీకి చెందినది కాకుంటే.. మరోచోట ప్రభుత్వ భూములను ఎందుకు కేటాయించారు? అవి ప్రభుత్వ భూములే అయితే స్వాధీనం చేసుకున్న వాటి స్థానంలో వేరేచోట భూములు ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది? స్వాధీనం చేసుకున్న భూ ములకు బదులు మరోచోట కేటాయించారంటే.. ఆ 400 ఎకరాలు వర్సిటీవేనని ప్రభు త్వం అంగీకరించినట్టే కదా? కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ భూములన్నీ తమవేన ని బుకాయించడంపై మేధావులు, నిపుణులు తప్పుపడుతున్నారు.
ప్రభుత్వం వేలం వేయాలని నిర్ణయించిన భూముల్లో ఉన్న ఐకానిక్ మష్రూమ్ రాక్స్నే హెచ్‌సీయూ ఏర్పడిననాటి నుంచి చిహ్నంగా వాడుతున్నారు. క్యాంపస్‌లో ఏకార్యక్రమాన్ని అయినా మష్రూమ్ రాక్స్ వేదికగానే విద్యార్థు లు నిర్వహిస్తున్నారు. ఈప్రాంతం పర్యాటక ప్రాంతంగానూ విరాజిల్లుతున్నది. తెలంగాణలోనూ ఇలాంటి మష్రూమ్ రాక్స్ మరెక్కడా లేవు. అటువంటి వారసత్వ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పగించి.. విచ్ఛిన్నం చేయడాన్ని చరిత్రకారులు సైతం వ్యతిరేకిస్తున్నారు. వారసత్వ సంపదను సంరక్షించాల్సిన ప్రభుత్వమే విచ్ఛిన్నం చేసి మన చరిత్రను కనుమరుగు చేయడం సీఎం రేవంత్ తెలివి తక్కువతనానికి నిదర్శనమని చరిత్రకారులు మండిపడుతున్నారు.
హెచ్‌సీయూను ఏర్పాటు చేస్తూ నాడు ప్రధాని ఇందిరాగాంధీ కంచె గచ్చిబౌలిలోని 2,253 ఎకరాలను కేటాయించారు. వర్సిటీకి కేటాయించినవి ప్రభుత్వ భూములే కాబట్టి రిజిస్ట్రేషన్ అంశాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. టీజీఐఐసీ చెప్తున్నట్టు ఆ భూములన్నీ ప్రభుత్వానివే అయితే మరి యూనివర్సిటీకి ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయో చూపించాలి కాదా? యూనివర్సిటీ ఏర్పడిన నాటి నుంచి 70 ఏండ్లు కాంగ్రెస్సే అధికారంలో ఉన్నది. ఇన్నాళ్లుగా యూనివర్సిటీ పేరిట ఒక్క గుంట భూమి కూడా ఎందుకు రిజిస్ట్రేషన్ చే యలేదు? ఇలా స్వాధీనం చేసుకుంటూ పోతే యూనివర్సిటీకి భవిష్యత్తు ఉంటుందా? కాంగ్రెస్ సర్కారు నిర్ణయంతో రాష్ట్రంలోని అన్ని వర్సిటీలకు ఇదే దుస్థితి వస్తుందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. యూనివర్సిటీ పేరిట రిజిస్ట్రేషన్ చేయకపోవడాన్నే సీఎం రేవంత్ ఆసరాగా తీసుకుని ప్రైవేటు పరం చేసేందుకు కుట్ర పన్నాడని విద్యార్థులు, విద్యావేత్తలు మండిపడుతున్నారు.
హెచ్‌సీయూ పరిధిలోని 400 ఎకరాలకు బదులు గోపన్‌పల్లిలో 397 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయించినట్టు పాత డాక్యుమెంట్ ను సోషల్ మీడియాలో లీక్ చేశారు. డాక్యుమెంట్ ప్రకారం 2004లోనే 400 ఎకరాలకు బదులు వేరే ప్రాంతంలో భూమి ఇచ్చారని.. ఇక హెచ్‌సీయూ భూములు ప్రభుత్వానికే చెందుతాయని సోషల్ మీడియాలో కొన్ని వార్తలను సర్క్యులేట్ చేస్తున్నారు. 2004 జనవరి 31న గోపన్‌పల్లిలోని సర్వే నంబర్ 36లో 191.36 ఎకరాలు, సర్వేనంబర్ 37లో 205.20 గుంటల భూమిని హెచ్సీయూకు కేటాయించినట్టు పేర్కొన్నారు. ఆ భూములను వెంటనే టాటా ఇన్స్టిట్యూట్ ఫర్ ఫండమెంటల్ రీసెర్చ్‌కు, మరో 100 ఎకరాలను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ యానిమల్ బయోటెక్నాలజీ అప్పగించారు. 400 ఎకరాలు హెచ్‌సీయూకే చెందుతాయనేది తేటతెల్లమవుతున్నది.