హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): ట్రిబ్యునల్‌లో నీటివాటాలు తేలేవరకూ రివర్ బోర్డుల గెజిట్‌ను అమలు చేయడం సాధ్యం కాదని తెలంగాణ ప్రభుత్వం మరోసారి తేల్చిచెప్పింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు నివేదించింది. ఏపీ పునర్విభజన చట్టానికి అనుగుణంగా 2021లో రివర్ బోర్డుల గెజిట్‌ను జారీచేసిన కేంద్రం.. ఉమ్మడి ప్రాజెక్టులతోపాటు పలు కాంపోనెంట్ల నిర్వహణను రివర్ బోర్డులకు అప్పగించాలని నిర్దేశించిన విషయం తెలిసిందే. ఈ గెజిట్‌ను అమలు చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇప్పటికే విచారణను చేపట్టింది. గెజిట్ అమలుపై అభిప్రాయాలు తెలపాలని కేంద్రంతోపాటు కృష్ణా నదీయాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కి, తెలంగాణ సర్కారుకు గతంలోనే నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో సాగర్, శ్రీశైలంలోని 15 కాంపొనెంట్లను బోర్డుకు అప్పగించాలంటూ ఇటీవల కేఆర్ఎంబీ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.
దీంతో కౌంటర్ అఫిడవిట్‌పై తెలంగాణ అధికారులు తాజాగా సుప్రీంకోర్టుకు రిజాయిండర్‌ను సమర్పించారు. కేంద్రం తరఫున స్పందించేందుకు ఏపీ విభజన చట్టం కేఆర్ఎంబీకి ఎలాంటి అధికారాలను కట్టబెట్టలేదని స్పష్టం చేశారు. బోర్డు వేసిన అఫిడవిట్ విచారణార్హం కాదని పేర్కొంటూ.. దానిని కొట్టేయాలని కోరారు. నదీజలాల వినియోగానికి సంబంధించి రెండు రాష్ర్టాల మధ్య ఎలాంటి ఒప్పందాలు, ట్రిబ్యునల్ కేటాయింపులు లేవని వివరిస్తూ.. ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డు ఎలా నిర్వహించగలదని ప్రశ్నించారు. ప్రస్తుతం తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి ట్రిబ్యునల్ విచారణ కొనసాగుతున్నదని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో నీటివాటాలు తేలేవరకూ ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించేది లేదని వివరించారు. నీటివాటాలు లేకుండానే ప్రాజెక్టులను బోర్డుకు అప్పగిస్తే తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందని తెలిపారు. అదనపు కౌంటర్ అఫిడవిట్లు, డాక్యుమెంట్లను సమర్పించేందుకు అవకాశమివ్వాలని సుప్రీంకోర్టును కోరారు.
గజ్వేల్ ఈఎన్సీగా బస్వరాజ్
గజ్వేల్ ఈఎన్సీగా ఎస్ఈ బస్వరాజ్‌కు అదనపు బాధ్యతలను అప్పగించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు గజ్వేల్ ఈఎన్సీగా వ్యవహరించిన హరిరామ్ ఆదాయానికి మించి ఆస్తులను కూడబెట్టినట్లు ఏసీబీ గుర్తించి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హరిరామ్‌ను సస్పెండ్ చేసిన ప్రభుత్వం.. ఆయన స్థానంలో పీవీపీ ప్రసాద్‌కు ఈఎన్సీగా నియమించింది. కానీ, ఆ మరుసటి రోజే ప్రసాద్ పదవీ విరమణ పొందారు. దీంతో ప్రభుత్వం గజ్వేల్ ఈఎన్సీగా ఎస్ఈ బస్వరాజ్‌కు అదనపు బాధ్యతలను అప్పగించింది.