హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ఐదుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ)గా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వారంతా 1994 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందినవారే. వారిలో హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ బీ శివధర్‌రెడ్డి, పోలీస్ అకాడమీ బాస్ అభిలాష బిస్త్, జైళ్ల శాఖ డీజీ సౌమ్యామిశ్రా, ఉమెన్‌సేఫ్టీ వింగ్, సీఐడీ డీజీ శిఖా గోయెల్ ఉన్నారు. వీరందరికీ లెవల్ 16 పే మ్యాట్రిక్స్ ఐపీఎస్ నిబంధనల ప్రకారం వేతనాలు అందనున్నాయి. ఏపీ క్యాడర్‌కు చెంది, తెలంగాణలో విధులు నిర్వర్తిస్తున్న అభిలాష బిస్త్‌కు నిబంధనల మేరకు పదోన్నతి కల్పించినట్టు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పదోన్నతి పొందిన వారందరినీ యథాస్థానంలోనే కొనసాగించనున్నట్టు తెలిపారు. ఉత్వర్వులు అందిన తర్వాత నలుగురు అధికారులు డీజీపీ జితేందర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ డీజీ బీ శివధర్‌రెడ్డి గవర్నర్ జిష్టుదేవ్ వర్మను మర్యాదపూర్వకంగా కలిశారు.