హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): ముగ్గురు పిల్లలు ఉన్నవారు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయకూడదనే నిబంధన కలిగిన పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేస్తూ ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ ప్రభుత్వానికి తాజాగా ప్రతిపాదనలు పంపినట్టు తెలిసింది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం ముగ్గురు సంతానం కలిగిన వారు స్థానికసంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులు. అయితే ఆ నిబంధనను తొలగించాలని రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల నిర్ణయించింది.
ఇందుకోసం పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు చేయాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో తొలుత ఆర్డినెన్స్ తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నది. క్యాబినెట్ నిర్ణయానికి అనుగుణంగా పంచాయతీరాజ్‌శాఖ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు రూపొందించి ఇప్పటికే ప్రభుత్వానికి పంపినట్టు సమాచారం. ఆర్డినెన్స్‌ను త్వరలో జారీచేసి, ముసాయిదా ఆర్డినెన్స్ గవర్నర్‌కు పంపించేందుకు సిద్ధమవుతున్నది. ఇప్పటికే పంచాయతీరాజ్ చట్టంలో పొందుపరచిన పలు నిబంధనలను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన బిల్లులకు గవర్నర్ ఆమోదం లభించింది.
ఈ ఆర్డినెన్స్‌కు సైతం ఆమోదం లభించే అవకాశమున్నది. అయితే బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ చేసిన బిల్లులకు, ఆర్డినెన్స్‌కు మాత్రం ఇప్పటికీ ఆమోదం లభించలేదు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో కూడా కోర్టు పరిధిలో ఉన్నది. ఈ కారణంగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడింది. నవంబర్‌లో ఆ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ కొనసాగనున్నది. ఈ రోపు ఆర్డినెన్స్ ద్వారా చట్టాన్ని సవరించేందుకు సర్కారు కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది.